కనకమహాలక్ష్మి దేవస్థానంలో వెండిపై వివాదం
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:00 AM
కనకమహాలక్ష్మి ఆలయంలో వెండి వస్తువుల లెక్క తేలడం లేదు.
విగ్రహం వెనుక తాపడం కొత్తది తయారుచేయించి ఇస్తే పాతది ఇస్తామని నాలుగేళ్ల క్రితం
మాల్ అధినేత వద్ద అధికారుల ప్రతిపాదన
60 కిలోలతో తయారుచేయించి ఆలయానికి బహూకరణ
పాత వెండి ఇవ్వని అధికారులు
తమకు ఇస్తామన్న వెండి ఇవ్వలేదని తాజాగా దాత లేఖ
విచారణ జరుపుతున్న డిప్యూటీ కమిషనర్
లెక్కల్లో తేడా?
60 కిలోల తాపడానికి కనిపించని రశీదులు
కమిషనర్ దృష్టిలో పెట్టకుండా నోటిమాటలతోనే వ్యవహారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కనకమహాలక్ష్మి ఆలయంలో వెండి వస్తువుల లెక్క తేలడం లేదు. గత నాలుగేళ్లుగా వెండి ఆభరణాల వివరాలు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారుల వద్ద లేవు. ప్రముఖ దాత లేఖతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ మొదలైంది.
వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి అమ్మవారికి భక్తులు బంగారు, వెండి ఆభరణాలు కానుకగా ఇస్తారు. వాటికి దేవస్థానం అధికారులు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలి. ఆభరణాలను లాకర్లో భద్రపరచాలి. ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈఓ) ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయినప్పుడు వాటి లెక్కలను కొత్త ఈఓకి అప్పగించాలి. అయితే గత నాలుగేళ్లుగా బంగారు ఆభరణాల లెక్కలు ఈఓలకు అందుతున్నాయి గానీ వెండి వివరాలు అందడం లేదు. అత్యంత వివాదాస్పద అధికారిణిగా పేరు తెచ్చుకున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగరి శాంతి ఈ దేవస్థానంలో ఈఓగా 2022లో పనిచేశారు. అంతకు ముందు పనిచేసిన ఈఓ జ్యోతి మాధవి వెండి లెక్కలు తనకు అప్పగించలేదని చెబుతూ శాంతి తన తరువాత వచ్చిన ఈఓ శిరీషకు ఆ లెక్కలు ఇవ్వలేదు. ఆ తరువాత ఈఓగా శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయనకూ అవి అందలేదు. ఆ తరువాత శోభారాణి ఈఓగా వచ్చి ఏడాది అవుతోంది. ఆమెకూ వెండి వివరాలు అందలేదు. ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. నగరంలో ప్రముఖ దాత ఒకరు కొద్దిరోజుల క్రితం దేవస్థానానికి లేఖ రాశారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం వెనుక గోడకు వెండి తాపడం కొత్తది చేయించి ఇవ్వాలని నాలుగేళ్ల క్రితం తమను కోరారని, ఆ ప్రకారం 60 కిలోలతో తయారు చేయించి ఇచ్చామని, దానికి బదులు పాత తాపడం 34 కిలోలు తమకు ఇస్తామన్నారని, అలాగే వెండి దానం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే.. ఆ వెండి కూడా తమకే ఇస్తామన్నారని, కానీ ఇంత వరకు ఒక్క గ్రాము వెండి కూడా తమకు ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఆలయ వర్గాల్లో కలకలం రేపింది. దాంతో ఆగమేఘాలపై వెండి లెక్కలు అప్పగించాలని ఇప్పటి ఈఓ శోభారాణి పాత ఈఓలు అందరికీ ఫోన్లు చేసి పిలిచారు. నాలుగు రోజుల క్రితం జ్యోతిమాధవి, కాళింగరి శాంతి, శిరీష, తదితరులంతా వచ్చి ఆ లెక్కలు ఇచ్చి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం అమ్మవారి విగ్రహం వెనుక ఉన్న కొత్త వెండి తాపడం 60 కిలోలు ఎవరు ఇచ్చారనే దానికి లెక్కలు ఎక్కడా కనిపించలేదు. అంటే రశీదు లేదు. దానిని ప్రముఖ దాత ఇచ్చారనే విషయం అందరికీ తెలుసు. కానీ దానికి ఆధారాలు లేవు. ఇది ఎలా జరిగిందనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. దానంగా ఇస్తేనే రశీదులు ఇస్తారని, అలా కాకుండా పాత వస్తువు ఇచ్చి కొత్త వస్తువు తీసుకుంటే ఇవ్వరని, అందువల్లే దానిని లెక్కలో చూపించలేదని ఆలయ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ తరహా బదలాయింపులు నిబంధనలకు విరుద్ధమని అధికారులే చెబుతున్నారు.
కమిషనర్ అనుమతి లేకుండా చేయలేరు
దేవస్థానాలకు వచ్చిన బంగారు, వెండి వస్తువులను ఏమైనా మార్పిడి చేయాలంటే...అందుకు ఆ శాఖ కమిషనర్‌కు లేఖ రాసి అనుమతి తీసుకోవాలి. ఆ వస్తువులను ప్రభుత్వానికి చెందిన మింట్‌కు పంపి, అక్కడే కరిగించాలి. ఇదంతా పెద్ద ప్రక్రియ. ఇలాంటివి ఎప్పుడో గానీ జరగవు. కనకమహాలక్ష్మి ఆలయంలో అంతా నోటిమాటలతో జరిగిపోయింది. కొత్తది 60 కిలోలు కావాలని, పాతది సుమారు 34 కిలోలు ఉంటుందని, మిగిలిన వెండి దాతల ద్వారా సమకూరుస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అవేవీ చేతికి రాక ముందే అమ్మవారికి ఆయన కొత్త తాపడం చేయించి ఇచ్చేశారు. దాంతో అధికారులకు పాత వెండి ఇవ్వాలనే ఆసక్తి పోయింది. ఆ తరువాత ఈఓలు ఒక్కొక్కరిగా మారిపోయారు. ఇటీవల ఆలయంలో ఒక వర్గం మరో వర్గానికి చెందిన వారిని ఇరికించాలనే ఉద్దేశంతో వెండి వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి (జేవీఓ) పల్లంరాజు ఇటీవల విచారణ చేశారు. ఈలోగా ఆయనకు సింహాచలం దేవస్థానం ఆభరణాలు లెక్క తేల్చే పని అప్పగించడంతో అటు వెళ్లారు. దాంతో ఇక్కడ లెక్కలు మధ్యలో ఆగిపోయాయి.
డీసీ విచారణ చేస్తున్నారు
కె.శోభారాణి, ఈఓ, కనకమహాలక్ష్మి దేవస్థానం
అమ్మవారి వెండి తాపడంపై ప్రముఖ దాత ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. దానిపై డిప్యూటీ కమిషనర్ విచారణ చేస్తున్నారు. అయితే ఆలయంలో పాత తాపడం, కొత్త తాపడం రెండూ ఉన్నాయి, నష్టం ఏమీ జరగలేదు. కాకపోతే రశీదులు లేవు.