ప్రకృతి సేధ్యంతో భూతాపం నియంత్రణ
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:45 PM
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా భూతాపం నియంత్రణ అవుతుందని రాష్ట్ర రైతు సాధికారత సంస్థ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి.విజయకుమార్ అన్నారు.
రాష్ట్ర రైతు సాధికారత సంస్థ చైర్మన్,
ప్రభుత్వ సలహాదారు టి.విజయకుమార్
ప్రకృతి సాగుతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
పంటలకు చీడపీడలు తట్టుకునే శక్తి అధికం
పాడేరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా భూతాపం నియంత్రణ అవుతుందని రాష్ట్ర రైతు సాధికారత సంస్థ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి.విజయకుమార్ అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తరణలో భాగంగా వివిధ శాఖల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పచ్చదనం ఉన్న ప్రాంతంలో కంటే ఎటువంటి పచ్చదనం లేని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయని, అదే క్రమంలో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్న ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుముఖం పడుతున్నట్టు పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. ఈ క్రమంలో ప్రకృతి సేధ్యాన్ని మరింతగా విస్తరించడం ద్వారా మానవాళికి ఎంతో మేలు చేసినట్టు అవుతుందన్నారు. ప్రకృతి సేధ్యంలో పెరిగిన మొక్కలకు వరదలు, చీడపీడలను తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ అంశంపై ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయాభివృద్ధికి అవసరమైన చర్యలను చేపడుతున్నామన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2027-28 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో శత శాతం ప్రకృతి వ్యవసాయం ఉంటుందన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 75 వేల మంది రైతులున్నారని, వారికి దశల వారీగా దానిపై శిక్షణ అందిస్తామన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్, పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు సైతం క్షేత్ర స్థాయి సందర్శనలు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ టి.బాబూరావునాయుడు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, జీసీసీ ఎండీ కల్పనాకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, కాఫీ బోర్డు డీడీ హెచ్‌ఆర్.మురళిధర్, స్పైసెస్ బోర్డు ఫీల్డ్ ఆఫీసర్ బి.కల్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.