విమానాశ్రయంలో కంట్రోల్ రూమ్
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:30 AM
మరో రెండు, మూడు రోజుల్లో విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడిచే అవకాశం ఉందని విశాఖపట్నం విమానాశ్రయం డైరెక్టర్ ఎన్.పురుషోత్తం అన్నారు.
ప్రయాణికులుకు 24 గంటలూ సమాచారం అందించేందుకు ఏర్పాట్లు
2, 3 రోజుల్లో పూర్తిస్థాయిలో విమానాల రాకపోకలు
విమానాశ్రయం డైరెక్టర్ ఎన్.పురుషోత్తం
గోపాలపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
మరో రెండు, మూడు రోజుల్లో విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడిచే అవకాశం ఉందని విశాఖపట్నం విమానాశ్రయం డైరెక్టర్ ఎన్.పురుషోత్తం అన్నారు. ఆయన బుధవారం విమానాశ్రయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ విమాన సర్వీస్‌ల రద్దుపై పత్రికా ముఖంగా ముందస్తు సమాచారం అందిస్తున్నామని, విమానాలు ఆలస్యమైతే ప్రయాణికులకు అన్ని సదుపాయాలు విమానాశ్రయంలో కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం విమానాశ్రయంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేశామని, 24 గంటలు ప్రయాణికులకు సమాచారం అందించడం కోసం డ్యూటీ టెర్మినల్ మేనేజర్‌ను నియమించామని పేర్కొన్నారు.
విశాఖ విమానాశ్రయం నుంచి ఈ నెల 3న 31 విమానాలు రాకపోకలు సాగించాల్సి ఉండగా 3 విమాన సర్వీసులు రద్దయ్యాయని తెలిపారు. ఈ నెల 4న ఏడు విమానాలు, 5న 15, 6న 9, 7న 10, 8న 8, 9న ఏడు, 10 (బుధవారం)న ఐదు విమాన సర్వీసులు రద్దయినట్టు వెల్లడించారు. ఈ నెల 7 నుంచి విమాన సర్వీసుల రద్దు కాస్త తగ్గిందన్నారు. రద్దయిన సర్వీసుల్లో అధిక శాతం ఇండిగో విమానాలే ఉన్నాయన్నారు. ఆ విమానాలకు సంబంధించి లగేజీని ప్రయాణికులకు అప్పగించే చర్యలు ఆ సంస్థ చేపట్టిందని, కొంతమందికి నేరుగా ఇళ్లకు పంపించే ఏర్పాటుచేసిందని తెలిపారు. విశాఖ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 8 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్య 30 శాతం మేర తగ్గిందన్నారు.