Share News

భూగర్భ జలాల వృద్ధికి నిరంతరం కృషి

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:10 AM

మానవాళి మనుగడకు ఎంతో కీలకమైన భూగర్భ జలాల వృద్ధికి నిరంతం కృషి చేయాలని కేంద్ర భూగర్భ జలాల బోర్డు రీజనల్‌ డైరెక్టర్‌ ఎం.జ్యోతికుమార్‌ అన్నారు.

భూగర్భ జలాల వృద్ధికి నిరంతరం కృషి
మాట్లాడుతున్న కేంద్ర భూగర్భ జలాల బోర్డు ఆర్‌డీ ఎం.జ్యోతికుమార్‌ , పక్కన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, తదితరులు

అధికారులకు కేంద్ర భూగర్భ జలాల బోర్డు రీజనల్‌ డైరెక్టర్‌ ఎం.జ్యోతికుమార్‌ సూచన

పాడేరు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): మానవాళి మనుగడకు ఎంతో కీలకమైన భూగర్భ జలాల వృద్ధికి నిరంతం కృషి చేయాలని కేంద్ర భూగర్భ జలాల బోర్డు రీజనల్‌ డైరెక్టర్‌ ఎం.జ్యోతికుమార్‌ అన్నారు. భూగర్భ జలాలపై కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఎటువంటి కాలుష్యం లేని ఈ ప్రాంతంలో ఉన్నవారంతా అదృష్టవంతులన్నారు. ఈ జిల్లాలో భూగర్భ జలాలు సైతం ఆశాజనకంగానే ఉన్నాయని, అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడం, వృద్ధి చేయడంపైనా శ్రద్ధ పెట్టాలన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భూగర్భ జలాల వృద్ధి ఎంతో కీలకమని, దానిని నిర్లక్ష్యం చేస్తే భూములు బీడు వారిపోయి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయన్నారు. భూగర్భ జలాల పెంపునకు 20 వరకు పద్ధ్దతులున్నాయని, వాటిని పాటిస్తే ఎటువంటి నీటి సమస్య ఏర్పడదని ఆయన తెలిపారు.

భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు

జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో భూగర్భ జలాలు అధికంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడుతున్నామన్నారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతలు, చెరువులతో పాటు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా 254 చెక్‌డ్యామ్‌లను నిర్మించామన్నారు. ప్రజలు సైతం పూర్వీకుల మాదిరిగా జలవనరుల సంరక్షణను ఒక ఆధ్యాత్మిక అంశంగా పరిగణించాలని ఆయన కోరారు. భూగర్బ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భూగర్భ జలాల బోర్డు అధికారి లక్ష్మీనారాయణ, శాస్త్రవేత్త ధామోదర్‌, అమెరికా ప్రతినిధి గోపాల్‌, ఎస్‌ఎంఐ డీఈఈ ఆర్‌.నాగేశ్వరరావు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, నీటి యాజమాన్య సంస్థ, చిన్ననీటి పారుదల శాఖ, గ్రామీణా నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బంది. పలువురు రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:10 AM