రెస్టో బార్ల నిర్మాణం అక్రమం
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:39 AM
విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో గల ఐదు రెస్టో బార్లు నిబంధనలు అతిక్రమించాయని హైకోర్టు నియమించిన జాయింట్ కమిటీ స్పష్టంచేసింది.
నిబంధనలు ఉల్లంఘించినట్టు నిర్ధారించిన జాయింట్ కమిటీ
విచారణలో పాత నిర్మాణాలని బుకాయింపు
వివరాలు సమర్పించాల్సిందిగా జీవీఎంసీ ఆదేశం
విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):
విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో గల ఐదు రెస్టో బార్లు నిబంధనలు అతిక్రమించాయని హైకోర్టు నియమించిన జాయింట్ కమిటీ స్పష్టంచేసింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునని స్పష్టం చేసినట్టు ఫిర్యాదీ పీతల మూర్తి యాదవ్ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
బి-జాగ్ రెస్టో బార్, తీరం బీచ్ రిసార్ట్, మేర్లిన్ కే రెస్టోబార్, శాంక్చమ్ బీచ్ రిసార్ట్ (తొట్లకొండ బీచ్ రిసార్ట్), విరాగో రెస్టో బార్లపై మూర్తియాదవ్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు ఆదేశం ప్రకారం జీవీఎంసీ అధికారులు ఆయా రెస్టోబార్లకు నోటీసులు జారీచేసి వివరణ కోరారు. వాటిలో రెండు ఏపీటీడీసీకి చెందినవి కావడంతో ఆ విభాగం అధికారుల వివరణ తీసుకున్నారు. బి-జాగ్ నిర్వాహకులు తాము 40 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో ఉంటున్నామని, 3/4 వంతు మాత్రమే సీఆర్‌జెడ్ పరిధిలో ఉందని, కొత్త నిర్మాణాలు ఏమీ చేపట్టలేదని వివరణ ఇచ్చారు. దాంతో వారిపై కోర్టు స్టేటస్ కో కొనసాగిస్తున్నారు. తీరం బీచ్ రిసార్ట్ నిర్వాహకులు తాము 1982లో ఆస్తి కొనుగోలు చేశామని, పంచాయతీ అనుమతులతో నిర్మాణం చేపట్టామని, కాబట్టి కొత్తగా సీఆర్‌జెడ్ అనుమతుల ప్రస్తావన తమకు తెలియదని బకాయించారు. విరాగో రెస్టో బార్ నిర్వాహకులు తాము కేవలం లీజుదారులమేనని పేర్కొన్నారు. అయితే ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్, ఈసీ కాపీ, 30 అడుగుల మాస్టర్ ప్లాన్ రహదారి, భవనం డ్రాయింగ్ అన్నీ సమర్పించాలని జీవీఎంసీ అధికారులు ఆదేశించారు. ఈ వివరణలన్నీ హైకోర్టుకు సమర్పించి, అక్కడ నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. హైకోర్టులో కమిటీ నివేదిక కూడా ఉన్నందున చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉందని మూర్తియాదవ్ పేర్కొన్నారు.