డిసెంబరుకల్లా ఇళ్ల నిర్మాణం పూర్తి
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:57 AM
నగరంలో పేదల కోసం శివారు ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని డిసెంబరు నాటికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ ఎండీ పి.అరుణ్‌బాబు ఆదేశించారు.
అధికారులకు గృహ నిర్మాణ సంస్థ ఎండీ అరుణ్‌బాబు ఆదేశాలు
రామవరం, గంగవరం లేఅవుట్‌లలో పనులు పరిశీలన
నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచన
విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పేదల కోసం శివారు ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని డిసెంబరు నాటికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ ఎండీ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. గురువారం విశాఖ విచ్చేసిన ఆయన ఆనందపురం మండలం రామవరం, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గంగవరంలో ఇళ్ల కాలనీలను సందర్శించి కాంట్రాక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని స్పష్టంచేశారు. లేఅవుట్‌లలో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్, పచ్చదనం తదితర అంశాలపై చర్చించారు. కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లను అధికారులు తనిఖీ చేసిన అనంతరం యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పూర్తిస్థాయిలో వివరాలు సమర్పించిన తరువాత మాత్రమే బిల్లులు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ శివారుల్లో 65 లేఅవుట్‌లలో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా, ఇప్పటివరకూ 32 వేలు పూర్తిచేసినట్టు తెలిపారు. పలు కారణాలతో 20 వేల ఇళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. మిగిలిన 50 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకూ ప్రారంభించని ఇళ్లపై తరువాత నిర్ణయం తీసుకుంటామని ఎండీ చెప్పారు. అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబుతో కలిసి జిల్లా హౌసింగ్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని సమీక్షిస్తూ, పనులు వేగవంతం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు మెటీరియల్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్.సత్తిబాబు, ఎస్‌ఈ కృష్ణయ్య, ఈఈలు సూరిబాబు, సుబ్రహ్మణ్యం, డీఈ రామకృష్ణ, మేనేజర్ మేరీ గ్రేస్, తదితరులు పాల్గొన్నారు.
నేటి ఉదయం 10 గంటలకు
పాఠశాలల్లో వందేమాతర గీతం ఆలాపన
విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం పది గంటలకు అన్ని పాఠశాలల్లో సామూహికంగా వందేమాతన గేయాన్ని ఆలపించనున్నారు. ఈ మేరకు అన్ని పాఠశాలల యాజమాన్యాలకు డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఇందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లుచేసుకోవాలన్నారు.