రూ.9.8 కోట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం
ABN , Publish Date - May 08 , 2025 | 12:52 AM
అరకు నియోజకవర్గంలో రూ.9.8 కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల్లో 36 యూనిట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలో కాంప్లెక్సులు నిర్మించనున్నామని కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు వద్ద ఐదు ఎకరాల్లో నిర్మించనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
డుంబ్రిగుడ, మే 7 (ఆంధ్రజ్యోతి): అరకు నియోజకవర్గంలో రూ.9.8 కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల్లో 36 యూనిట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలో కాంప్లెక్సులు నిర్మించనున్నామని కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు వద్ద ఐదు ఎకరాల్లో నిర్మించనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుతో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ కాంప్లెక్స్‌లో అరకు బ్రాండ్ పేరున కాఫీ, మిరియాలు, పసుపు, చిరుధాన్యాలు, ఇతర గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, రూ.500 కోట్లతో పరిశ్రమల పార్కు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించనున్నామన్నారు. ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర మాట్లాడుతూ కుటీర పరిశ్రమల ఏర్పాటుతో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో అరకులోయ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో అరకు సర్పంచ్ శారద, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, జిల్లా పరిశ్రమల అధికారి జి.రవిశంకర్, స్థానిక నాయకులు సుబ్బారావు, జనసేన అరకు పార్లమెంట్ ఇన్‌చార్జి చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.