నిబంధనలకు పాతర.. నిర్మాణాల జాతర
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:20 PM
జీవీఎంసీ అనకాపల్లి జోన్-7 కార్యాలయ పరిధిలో పలు చోట్ల నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ప్రధాన రహదారులను ఆనుకుని సెట్‌బ్యాక్స్ వదలకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
అడ్డగోలుగా బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు
సెట్‌బ్యాక్స్ వదలకుండానే ప్రధాన రహదారుల సమీపంలో కట్టడాలు
జీప్లస్ టూకు అనుమతి తీసుకుని ఐదు అంతస్థుల వరకు నిర్మిస్తున్నవి ఎన్నో..
పట్టించుకోని టౌన్ ప్లానింగ్ సిబ్బంది
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ అనకాపల్లి జోన్-7 కార్యాలయ పరిధిలో పలు చోట్ల నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ప్రధాన రహదారులను ఆనుకుని సెట్‌బ్యాక్స్ వదలకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
పట్టణంలోని శారదా కాలనీ, వుడ్‌పేట, ఆర్టీసీ కాంపెక్స్ రోడ్డు, పెరుగుబజార్, రింగ్‌రోడ్డు, గవరపాలెం, రఘురామ కాలనీ, లక్ష్మీనారాయణనగర్, లక్ష్మీదేవిపేట, గాంధీనగర్, పూడిమడక రోడ్డు, సుంకరమెట్ట, సిరసపల్లి, కొండకొప్పాకలలో అధిక సంఖ్యలో భారీ వాణిజ్య భవన నిర్మాణాలు సాగుతున్నాయి. అయితే వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్టు తెలిసింది. కొందరు జీప్లస్ టూ అనుమతులు పొంది ఐదు, నుంచి ఆరు అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నట్టు సమాచారం. జీవీఎంసీ పరిధిలో ఒక అసిస్టెంట్ సిటీ ప్లానర్ పోస్టు ఉన్నా, బదిలీపై ఎవరూ రాకపోవడంతో గాజువాక ఏసీపీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే అనకాపల్లి వచ్చి వెళుతున్నారు. ప్రస్తుతం ఒక టౌన్ ప్లాన్ సూపర్‌వైజర్, వార్డు సచివాలయాల్లో ప్లానింగ్ కార్యదర్శులు 14 మంది ఉన్నా, వారు అడ్డగోలు నిర్మాణాలపై సక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలున్నాయి. కాగా అనకాపల్లి తహశీల్దార్ కార్యాలయానికి వెనుక శారదా కాలనీలో ఒక బిల్డర్ రెసిడెన్సియల్ అపార్టుమెంట్ కోసం తక్కువ మొత్తంలో జీవీఎంసీకి చలానా కట్టి భవనం నిర్మించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ భవనంలో ఒక ప్రైవేటు ఆస్పత్రి నడుస్తోంది. ఇదే వీధిలో మరో ప్రైవేటు ఆస్పత్రి యజమాని ఎటువంటి అనుమతులు పొందకుండానే భవనం నిర్మించారని సమాచారం. రింగ్ రోడ్డు జంక్షన్‌కు సమీపంలో ఒక భారీ భవనాన్ని రెసిడెన్సియల్ కోసం అనుమతులు పొంది ప్రస్తుతం ఆ భవనంలో కన్వెన్షన్ హాలు నడుపుతున్నారు. గాంధీనగర్, లక్ష్మీనారాయణ నగర్, రఘురామ కాలనీల్లో రెండు అంతస్థుల భవనాలకు అనుమతులు తీసుకొని నాలుగైదు, అంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలో సరైన రోడ్డు లేకపోయినా భారీ భవన నిర్మాణం చేపడుతున్నారు. పెరుగుబజారు, రింగురోడ్డు, గవరపాలెం, రఘురామ కాలనీలో మాస్టర్ ప్లాన్‌లో 40 అడుగుల రోడ్డుకు సమీపంలో భవన నిర్మాణాలు చేపడుతుండడంతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలను గుర్తిస్తాం
జోనల్ కార్యాలయం పరిధిలో నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు జరుగుతుండడంపై జోనల్ కమిషనర్ చక్రవర్తిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా, ఆ వార్డుల సచివాలయాల పరిధిలో ప్లానింగ్ కార్యదర్శులను అప్రమత్తం చేసి, అనుమతులు లేని నిర్మాణాలను గుర్తిస్తామని తెలిపారు. జోనల్ కార్యాలయం పరిధిలో ప్లానింగ్ అనుమతులు పొందకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి, అవసరమైతే నోటీసులు జారీ చేస్తామన్నారు.