Share News

60 ఎకరాల అన్యాక్రాంతానికి కుట్ర

ABN , Publish Date - May 11 , 2025 | 01:19 AM

ముడసర్లోవ సర్వే నంబరు 31/2లో సుమారు 20 నుంచి 30 ఎకరాలను చాలాకాలం క్రితం పేదలకు ఇచ్చారు.

60 ఎకరాల అన్యాక్రాంతానికి కుట్ర

  • వివాదాస్పద భూములకు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు

  • ఇవ్వాల్సిందిగా రెవెన్యూ బాస్‌ ఆదేశాలు

  • అవి ప్రభుత్వ భూములని గతంలో ఇచ్చిన నివేదికలకు

  • భిన్నంగా నిర్ణయాలు

  • విలువ రూ.వందల కోట్లలో...

  • ఆ విషయం ప్రభుత్వానికి తెలియడంతో ఆయనకు స్థానచలనం

  • ఉన్నతాధికారి నిర్ణయాలపై సర్కారు ఆరా

  • వాటి వెనుక ఎవరు ఉన్నారనే సమాచారం సేకరణ

విశాఖపట్నం/కొమ్మాది/ఆరిలోవ, మే 10 (ఆంధ్రజ్యోతి):

ముడసర్లోవ సర్వే నంబరు 31/2లో సుమారు 20 నుంచి 30 ఎకరాలను చాలాకాలం క్రితం పేదలకు ఇచ్చారు. అయితే అవి రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతంలో ఉన్నందున రైతులకు ఇచ్చిన పట్టాలు రద్దు చేశారు. ఆ భూముల కోసం ఇటీవల కొందరు దళారులు రంగంలోకి దిగడంతో రెవెన్యూలో ఉన్నతాధికారి ఒకరు ఆగమేఘాలపై రైతులకు అనుకూలంగా నిరభ్యంతర పత్రం ఇవ్వాలని ఆదేశించారు.

గాజువాక మండలం వడ్లపూడి, తుంగ్లాం పరిసరాల్లో సుమారు ఐదు ఎకరాల చెరువులో చేపల పెంపకానికి నాలుగు దశాబ్దాల క్రితం ఒకరికి ప్రభుత్వం పట్టా ఇచ్చింది. కాలక్రమేణా వడ్లపూడి ఉక్కు నిర్వాసితులకు కేటాయించడంతో నివాసాలు ఏర్పడ్డాయి. చేపల పెంపకం నిలిచిపోయింది. అయితే ఆ భూమికి ఇచ్చిన పట్టాను రెగ్యులర్‌ చేయాలని రైతు కోరితే...జిల్లా యంత్రాంగం తిరస్కరించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెరువులు, వాగులు క్రమబద్ధీకరించకూడదు. అయితే అదే రెవెన్యూ ఉన్నతాధికారి మాత్రం చేపల చెరువును రెగ్యులర్‌ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

విశాఖ జిల్లాలో వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేయడానికి రెవెన్యూశాఖలో ఉన్నతాధికారి ఒకరు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. సుమారు 60 నుంచి 70 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు క్రమబద్ధీకరించాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది.

పేదలు, మాజీ సైనికుల పేరిట క్లెయిమ్‌ కోసం వచ్చిన అర్జీలను గతంలో అనేక పర్యాయాలు జిల్లా యంత్రాంగం తిరస్కరించింది. అయినా వాటిని ఆయా వ్యక్తులకు దఖలు పరచాలని సదరు రెవెన్యూ ఉన్నతాధికారి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చినట్టు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. నిబంధనల మేరకు ఆ భూములు ఎవరికీ రెగ్యులర్‌ చేయలేమని నివేదికలో పేర్కొంది.

విశాఖ నగరానికి ఆనుకుని మండలాల్లో భూముల రేట్లు అనేక రెట్లు పెరిగాయి. ఎకరా రూ.కోట్లలో ఉండడంతో వాటిపై దళారులు, బిల్డర్ల కన్ను పడింది. ప్రధానంగా వివాదాస్పదమైన భూములపై దృష్టిసారించిన దళారులు రంగంలోకి దిగి పట్టాలు పొందిన రైతులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలను పట్టుకుని భూముల రెగ్యులైజేషన్‌ కోసం, నిరభ్యంతర పత్రాలు జారీకి జిల్లా యంత్రాంగానికి అనేక పర్యాయాలు అర్జీలు పెట్టించారు. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లుగా పనిచేసిన పలువురు అటువంటి అర్జీలను తిరస్కరించారు. కొందరు కోర్టులో దాఖలు చేసిన కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో ముఖ్య అధికారిగా వచ్చిన సీనియర్‌ అధికారి మాత్రం జిల్లా యంత్రాంగం గతంలో తిరస్కరించిన భూములకు నిరభ్యంతర పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు.

విశాఖ రూరల్‌ మండలం మధురవాడ సర్వేనంబరు 370/1, 367/1, 352/3, కొమ్మాది సర్వే నంబరు 114/1, 150/2, ముడసర్లోవలో 31/2, ఆనందపురం మండలం తర్లువాడలో సర్వే నంబరు 3/3, పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌ పురంలో సర్వేనంబరు 99, గాజువాక మండలం వడ్లపూడిలో సర్వే నంబరు 122/1, శనివాడలో సర్వేనంబరు 92, తలారివానిపాలెంలో 35/4లో భూములతోపాటు జిల్లాలో మరికొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములకు రమారమి 60 నుంచి 70 ఎకరాలకు నిరభ్యంతర పత్రాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పేర్కొన్న కొన్ని సర్వే నంబర్లలో భూములకు ఎన్‌వోసీ ఇవ్వాలని అధికారులను మౌఖికంగా ఆదేశించారు. ఆ భూములకు ఎన్‌వోసీ ఇవ్వలేమని, కొన్ని భూములు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని, మిగిలినవి ప్రభుత్వ భూములేనని పేర్కొంటూ...వాటిపై కోర్టులో కేసులు ఉన్నాయని నివేదించారు. అయితే సదరు ఉన్నతాధికారి ఈ ఏడాది జనవరి నుంచి ఒక్కొక్క దానికి నిరభ్యంతర పత్రాలు జారీచేయాలని ఆదేశించారు. ఈ విధంగా సుమారు 12 నుంచి 15 సర్వే నంబర్లకు ఆదేశాలు వచ్చాయి.

ముడసర్లోవ రిజర్వాయర్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో భూములకు ఎటువంటి పట్టాలు ఇవ్వకూడదు. అందుకు అనుగుణంగా చాలాకాలం క్రితం ఇచ్చిన పట్టాలను అప్పట్లోనే రద్దు చేసినా వాటిపై కొందరు పోరాటం చేస్తున్నారు. నీటి ప్రవాహాలు, చెరువులు, వాగులు ఎవరికీ ఇవ్వరాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ముడసర్లోవలో నీటి ప్రవాహం ఉన్న ప్రాంతంలో భూములకు నిరభ్యంతర పత్రాలు ఇవ్వకూడదు. ఇదే తీర్పు మేరకు వడ్లపూడిలో చెరువుకు ఎన్‌వోసీ ఇవ్వకూడదు. ఇంకా పక్కాగా ప్రభుత్వ భూమి అని తేలిన చోట్ల కూడా ఎన్‌వోసీ ఇవ్వాలని సదరు ఉన్నతాధికారి ఆదేశించారు. ఆయా భూములకు ఎన్‌వోసీ ఇవ్వలేమని జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అప్పటికే రెవెన్యూ ఉన్నతాధికారిని ఆ స్థానం నుంచి తప్పించిన ప్రభుత్వం...జిల్లాల్లో ఎన్‌వోసీ ఇవ్వాలని ఆయన సిఫారసు చేసిన భూములపై ఆరా తీసింది. ఎన్‌వోసీ ఇవ్వాలన్న భూముల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?...అన్నదానిపై వివరాలు సేకరిస్తుంది.

Updated Date - May 11 , 2025 | 01:19 AM