Share News

స్టీల్‌ప్లాంటు నిర్వీర్యానికి కుట్ర

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:12 AM

దేశానికి విశాఖ స్టీల్‌ప్లాంటు తలమానికంగా ఉందని, అటువంటి ప్రతిష్టాత్మకమైన కర్మాగారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌లకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు.

స్టీల్‌ప్లాంటు నిర్వీర్యానికి కుట్ర

ప్లాంటును పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలి

కేంద్రంపై ఒత్తిడి తెవాలి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి

గాజువాక, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

దేశానికి విశాఖ స్టీల్‌ప్లాంటు తలమానికంగా ఉందని, అటువంటి ప్రతిష్టాత్మకమైన కర్మాగారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌లకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు. స్టీల్‌ప్లాంటులో ఈవోఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌)లను నిరసిస్తూ గురువారం పాతగాజువాక జంక్షన్‌ నుంచి కొత్తగాజువాక వరకూ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పాతగాజువాక జంక్షన్‌లో జరిగిన సభలో బేబి మాట్లాడుతూ దేశంలో నాణ్యమైన ఉక్కు ఉత్పత్తిలో విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రథమ స్థానంలో ఉందన్నారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ప్లాంటును నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ప్లాంటును కేంద్రం అమ్మాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదని ఆరోపించారు. గతంలో ప్రైవేటీకరణ అయిన సంస్థల పరిస్థితి నేడు ఎలా ఎందో రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు ముందుకు రావాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ప్రభుత్వ రంగంలోనే ఉపాధి అవకాశాలు వస్తాయని, ప్రైవేటు రంగంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. స్టీల్‌ప్లాంటును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ప్లాంటు విషయంలో ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి, కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్మిక సంఘ నాయకుడు జె.అయోధ్యరాం, యు.రామస్వామి, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 01:12 AM