క్యాన్సర్‌ను జయించి....
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:13 AM
నగరానికి చెందిన మున్నీ కైజరే అరుదైన ఘనతను సాధించారు.
58 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహణ
సత్తా చాటిన నగర మహిళ
విశాఖపట్నం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):
నగరానికి చెందిన మున్నీ కైజరే అరుదైన ఘనతను సాధించారు. రొమ్ము క్యాన్సర్ బారినపడి కోలుకున్న ఆమె 58 ఏళ్ల వయసులో 18 వేల అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించారు. ఎండాడ ప్రాంతానికి చెందిన మున్సీ టింపనీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. ఆమె 2017లో రొమ్ము క్యాన్సర్ బారినపడ్డారు. సుమారు ఏడాదిన్నరపాటు క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించారు. ఆ తరువాత ఆరేళ్లకు కొందరు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దానిని కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పూణెకు చెందిన గిరి ప్రేమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో ఐదుగురు మహిళలతో కలిసి గత నెల మూడో తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లారు. 12వ తేదీ నాటికి బేస్ క్యాంపునకు చేరుకుని తిరిగి 17వ తేదీ నాటికి వెనక్కి వచ్చారు. మహిళలు చిన్నచిన్న సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలని, ఆత్మస్థైర్యంతో ముందుకుసాగితే విజయాలను సాధించగలమని మున్నీ పేర్కొన్నారు.
అంగన్‌వాడీ పోస్టులకు తీవ్ర పోటీ
ఏడు కార్యకర్తల పోస్టులకు 64, 53 హెల్పర్ పోస్టులకు 197 దరఖాస్తులు
స్థానిక ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు
అధికారులకు నేరుగా ఫోన్ చేయిస్తున్న మరికొందరు అభ్యర్థులు
ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను స్ర్కూట్నీ చేస్తున్న అధికారులు
విశాఖపట్నం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):
జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్త, ఆయా పోస్టుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. భీమునిపట్నం, విశాఖ అర్బన్ ప్రాజెక్టుల పరిఽధిలో ఖాళీల భర్తీ కోసం అధికారులు కొద్దిరోజుల కిందట నోటిఫికేషన్ విడుదల చేయగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులు పలువురు స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తమకు ఎలాగైనా పోస్టు వచ్చేలా చూడాలంటూ అభ్యర్థిస్తున్నారు. తమకు తెలిసిన స్థానిక నాయకుల ద్వారా సిఫారసు లేఖలు తీసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఆయా పోస్టులను మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారని, సిఫారసులను పరిగణనలోకి తీసుకోరని చెబుతున్నా అభ్యర్థులు వినిపించుకోవడం లేదు. ‘మీరు లెటర్ ఇస్తే చాలు సర్. మిగిలిన పని మేము చూసుకుంటాం’ అంటున్నారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో లేఖలు ఇస్తున్నారు. ఇప్పటివరకూ సిఫారసు లేఖలతో 20 మంది వరకూ ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మరికొందరు కార్యాలయ అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో ఫోన్లు చేయిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్లకు వచ్చేలా చూడండని కొందరు నేతలు చెబుతున్నట్టు తెలుస్తోంది.
భారీగా దరఖాస్తులు..
భీమునిపట్నం ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న ఐదు కార్యకర్తల పోస్టులకు 32 మంది దరఖాస్తు చేశారు. అలాగే, విశాఖ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న రెండు కార్యకర్తల పోస్టులకు మరో 32 మంది అభ్యర్థులు దరఖాస్తులు వచ్చాయి. అలాగే, భీమునిపట్నం ప్రాజెక్టు పరిధిలో 11, పెందుర్తి ప్రాజెక్టు పరిధిలో 21, విశాఖ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 21 హెల్పర్ పోస్టులకు 193 మంది దరఖాస్తు చేశారు. ఆయా దరఖాస్తులను ప్రస్తుతం అధికారులు స్ర్కూట్నీ చేస్తున్నారు. అయితే, దరఖాస్తు చేసిన వారిలో దాదాపు ప్రతి ఒక్కరూ రాజకీయంగా పలుకబడిని ఉపయోగిస్తుండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక పత్రాలు అందిస్తామని చెబుతున్నారు.
కేజీహెచ్‌లో విద్యుత్ సమస్యపై విచారణకు కమిటీ
విశాఖపట్నం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయంపై విచారణకు కమిటీని నియమించారు. ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆస్పత్రి అధికారుల తీరుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి కమిటీని ఏర్పాటుచేశారు. ఆమె నేతృత్వంలో ఆస్పత్రి అడ్మినిస్ర్టేటర్ ఎన్‌వీ రమణ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖరంనాయుడు, అడ్మినిస్ర్టేషన్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ కిరణ్ విచారణ చేపడతారు. మార్చురీ వద్ద పనులు చేపట్టిన అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలను సేకరించనున్నారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు, డీఎంఈకి అందించనున్నారు.