Share News

సూర్యఘర్‌పై అయోమయం

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:15 PM

మన్యంలో సూర్యఘర్‌ యోజనపై వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. 200 యూనిట్‌ల విద్యుత్‌ను వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సూర్యఘర్‌ యోజనలో ఉచితంగా సోలార్‌ యూనిట్‌లను ఏర్పాటు చేస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ప్రచారం చేశారు.

సూర్యఘర్‌పై అయోమయం

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్‌ యూనిట్‌ల ఏర్పాటుపై అస్పష్టత

ఉచితమని ప్రచారం.. అమలు కాని వైనం

ఏజెన్సీలో 1,13,913 మంది ఎస్టీ, 721 మంది ఎస్సీ విద్యుత్‌ వినియోగదారులు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

మన్యంలో సూర్యఘర్‌ యోజనపై వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. 200 యూనిట్‌ల విద్యుత్‌ను వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సూర్యఘర్‌ యోజనలో ఉచితంగా సోలార్‌ యూనిట్‌లను ఏర్పాటు చేస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి ఉచితంగా సోలార్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసే పథకమే లేదని, ఆయా యూనిట్‌లకు రాయితీ, బ్యాంకు రుణాలు పొందే అవకాశం మాత్రమే ఉందని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

డిసెంబరు నెలలో సూర్యఘర్‌కు రిజిస్ట్రేషన్‌

పీఎం సూర్యఘర్‌ యోజనలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులకు ఉచితంగా సోలార్‌ యూనిట్‌లను ఏర్పాటు చేస్తారని పేర్కొంటూ గతేడాది డిసెంబరులో ఏపీఈపీడీసీఎల్‌ సిబ్బంది ఇంటింటా తిరిగి రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో తమకు ఉచితంగా సోలార్‌ యూనిట్‌లు మంజూరవుతాయని అందరూ భావించారు. కానీ ఆ తరువాత దానిపై ఎవరూ ఎటువంటి సమాచారాన్ని అందించలేదు.

ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో పేర్కొన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి

ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా సోలార్‌ యూనిట్‌లను అందించాలని గత ఏప్రిల్‌ 21న జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులకు ఆమె సూచించారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందనా లేదు. వాస్తవానికి పీఎం సూర్యఘర్‌ యోజనలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్‌ యూనిట్‌లు అందిస్తారా?, లేదా? అనే దానిపై అధికారులు కనీసం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఈ పథకంపై వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. కాగా సామూహికంగా పాడేరు, అరకులోయ, చింతపల్లి సబ్‌డివిజన్ల పరిధిలో పలు పల్లెలకు సోలార్‌ యూనిట్‌లు పెట్టి ఉచితంగా సోలార్‌ విద్యుత్‌ను అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. ఈ తరహా వ్యవహారం గతం నుంచి కనీస విద్యుత్‌ సదుపాయం లేని కొండ శిఖర గ్రామాల్లో సోలార్‌ యూనిట్‌లను ఏర్పాటు చేయడం వంటివి కొనసాగుతున్నాయి. దీంతో పీఎం సూర్యఘర్‌ యోజన మన్యంలో ఎలా అమలు చేస్తారనేది అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మన్యంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యుత్‌ వినియోగదారుల వివరాలు

----------------------------------------------------------------------------------

వ.సం మండలం ఎస్సీలు ఎస్టీలు ఇతరులు మొత్తం

----------------------------------------------------------------------------------------------

1. పాడేరు 56 14,563 5,427 20,046

2. హుకుంపేట 24 6241 2,326 8,591

3. పెదబయలు 5 8606 1,561 10,172

4. ముంచంగిపుట్టు 7 10,519 1,906 12,432

5. అరకులోయ 49 14,603 3,807 18,459

6.డుంబ్రిగుడ 16 4,868 1,269 6,153

7. అనంతగిరి 199 8,092 1,999 10,290

8. చింతపల్లి 193 21293 4,073 25,559

9. జీకేవీధి 48 5,323 1,019 6,390

10. జి.మాడుగుల 1 10,835 1,504 12,340

11.కొయ్యూరు 123 8,970 3,447 12,540

-----------------------------------------------------------------------------------

మొత్తం 721 1,13,913 28,338 1,42,972

-----------------------------------------------------------------------------------

Updated Date - Jun 03 , 2025 | 11:15 PM