వేసవి క్రీడా శిబిరాలపై సందిగ్ధం
ABN , Publish Date - May 13 , 2025 | 01:27 AM
జీవీఎంసీ వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. క్రీడల పట్ల చిన్నారుల్లో ఆసక్తి పెంపొందించేందుకు, ఇప్పటికే అవగాహన ఉన్నవారికి మెళుకువలు నేర్పేందుకు జీవీఎంసీ ఏటా వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తుంది.

రూ.1.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన జీవీఎంసీ అధికారులు
నెల క్రితమే ఇన్‌చార్జి కమిషనర్ గ్రీన్‌సిగ్నల్
ఇంతవరకూ కౌన్సిల్ ఆమోదం పొందని వైనం
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. క్రీడల పట్ల చిన్నారుల్లో ఆసక్తి పెంపొందించేందుకు, ఇప్పటికే అవగాహన ఉన్నవారికి మెళుకువలు నేర్పేందుకు జీవీఎంసీ ఏటా వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తుంది. మే నెలలో 15 నుంచి 20 రోజులుపాటు ఈ శిబిరాలను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ప్రతి వార్డులో శిబిరాలు ఏర్పాటుచేయాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. శిబిరాలకు వచ్చే పిల్లలకు టీషర్టులు, బిస్కెట్‌ప్యాకెట్, పాలు, శిక్షణ ఇచ్చే కోచ్‌లకు గౌరవ వేతనం చెల్లింపు, క్రీడా పరికరాలు కొనుగోలు వంటివాటికి రూ.1.3 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందుకు ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అనుమతి తీసుకున్నారు. ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపిన తర్వాత టెండర్లు పిలిచి క్రీడా శిబిరాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపి దాదాపు నెల రోజులు గడుస్తున్నా సరే కౌన్సిల్ ఆమోదం లభించకపోవడంతో క్రీడా శిబిరాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 20న కౌన్సిల్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ...అప్పుడు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినా...క్రీడా పరికరాల సరఫరాకు టెండర్ పిలవాల్సి ఉంటుంది. దీనికోసం కనీసం వారం, పది రోజులు గడువు ఇవ్వాలి. ఈ లెక్కన మే నెలాఖరు నాటికిగానీ టెండర్ ప్రక్రియ పూర్తికాదని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత టెండర్లు ఖరారై క్రీడా పరికరాలను సరఫరా చేసినాసరే...జూన్ 12 నుంచి పాఠశాలల పునఃప్రారంభం ఉంటుంది కాబట్టి శిబిరాలను నిర్వహించడానికి అవకాశం ఉండదు. ఏటా మే నెలలో జరిగే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను జూన్ నెలలో నిర్వహిస్తే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తాయని జీవీఎంసీ పాలకవర్గం పెద్దలు భావిస్తున్నారు. అందుకే వీలైతే షార్ట్‌టెండర్ ద్వారా క్రీడా పరికరాల సరఫరాకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జీవీఎంసీ అధికారులను మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణపై సర్వత్రా సందిగ్ధం నెలకొందనే చెప్పుకోవాలి.