ఐకానిక్ టవర్స్‌పై గందరగోళం
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:09 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పెదరుషికొండలో నిర్మించ తలపెట్టిన 50 అంతస్థుల ఐకానిక్ టవర్స్ నిర్మాణంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
పెదరుషికొండలో 50 అంతస్థులతో ఆరు టవర్స్
నిర్మించేందుకు వీఎంఆర్‌డీఏ ప్రణాళిక
ఆర్‌పీఎఫ్‌కు కానరాని స్పందన
ప్రముఖ సంస్థతో ఒప్పందం జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం
అటువంటిదేమీ లేదన్న చైర్మన్ ప్రణవ్‌గోపాల్
మరోసారి ప్రకటన ఇచ్చేందుకు యోచిస్తున్నట్టు వెల్లడి
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పెదరుషికొండలో నిర్మించ తలపెట్టిన 50 అంతస్థుల ఐకానిక్ టవర్స్ నిర్మాణంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండించాల్సిన అధికారులు మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇది ఉద్దేశపూర్వక ప్రచారమా?...అనే అనుమానం కలుగుతోంది.
రాష్ట్రంలో అత్యంత ఎత్తైన అంటే 50 అంతస్థుల భవన నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ ఈ ఏడాది జూలైలో ప్రణాళిక రూపొందించుకుంది. పెబ్బల్స్ బీచ్ అపార్టుమెంట్ పక్కన (ఐటీ పార్కు దగ్గర) సర్వే నంబరు 331/1లో 4.07 ఎకరాల్లో ఐకానిక్ టవర్స్ నిర్మించాలనేది ఆలోచన. ఆరు ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. జాయింట్ వెంచర్/పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలని రిక్వెస్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌పీఎఫ్) పిలిచారు. అందులో 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే డ్యూప్లెక్స్ ఫ్లాట్లు ఉంటాయి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పూల్ డెక్, సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, తదితర అత్యాధునిక వసతులు ఉంటాయి. అయితే ఈ ఆర్‌పీఎఫ్‌కు ఒకేఒక్క దరఖాస్తు వచ్చింది.
నగరంలోని సీతమ్మధారలో ఆక్సిజన్ టవర్స్ ఉన్నాయి. అవి రెండు టవర్స్, 36 అంతస్థులు. వీఎంఆర్‌డీఏ నిర్మించ తలపెట్టింది ఆరు టవర్లు, 50 అంతస్థులు. భారీ పెట్టుబడి కావాలి. ఇది లాభదాయకంగా ఉంటుందా?, ఉండదా?..అనే అనుమానంతో ఎవరూ ముందుకురాలేదు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ప్రైవేటు సంస్థలు అనేక అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల నిర్మాణం ప్రారంభించాయి. డిమాండ్‌కు మించి ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వాస్తవం ఇలా ఉండగా...ఈ ప్రాజెక్టును నగరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ దక్కించుకుందని, వారే నిర్మాణం చేపడతారంటూ సోషల్ మీడియాలో వారం రోజులుగా వైరల్ అవుతోంది. దీనిని వీఎంఆర్‌డీఏ అధికారులు ఎవరూ ఖండించడం లేదు.
కైలాసగిరిపై అంటూ మరో ప్రచారం
ఇటీవల నగరంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు ముగిసిన మరుసటిరోజు (16వ తేదీ) ఆదివారం ఉదయం 7 గంటలకు పురపాలక శాఖా మంత్రి నారాయణ వీఎంఆర్‌డీఏలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన కైలాసగిరిపై 50 అంతస్థుల ఐకానిక్ టవర్ నిర్మిస్తున్నామని, దీనికి అనుమతులు కూడా ఇచ్చామని చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తొలుత జిల్లా అధికారుల ప్రకటన కూడా ఆ విధంగానే విడుదలైంది. ఆ తరువాత నాలుక కరుచుకొని ‘కైలాసగిరి’ అనే పదం తొలగించారు. అంతే తప్ప ఆ ప్రాజెక్టు వచ్చే ఏరియా ఏమిటో స్పష్టత ఇవ్వలేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై జరుగుతున్న ప్రచారం గురించి వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ వద్ద ప్రస్తావించగా, దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామన్నారు. ఎవరికీ ఈ ప్రాజెక్టును అప్పగించలేదని, మరోసారి ప్రకటన ఇచ్చే అవకాశం ఉందన్నారు.