ఈ-చలాన్‌ల గందరగోళం!
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:43 AM
నగరంలో వాహన చోదకులకు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.
ఆరునెలల కిందట కనిపించని పెండింగ్ చలాన్‌లు.. తాజాగా వెలుగులోకి
క్లియర్ చేయాలని ఒత్తిడి
పెండింగ్ చలాన్‌లు లేవంటున్న వాహనచోదకులు
ఆన్‌లైన్‌లో తీసి చూపిస్తున్న పోలీసులు
ఇప్పుడెలా కనిపిస్తున్నాయో తెలియక అయోమయం
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరంలో వాహన చోదకులకు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. కొద్దిరోజుల కిందటివరకు తమ వాహనంపై ఎలాంటి పెండింగ్ చలాన్లు లేకపోవడంతో ధీమాగా ఉన్న వాహనచోదకులకు ఇప్పుడు భారీగా పెండింగ్ చలాన్‌లు ఉన్నట్టు పోలీసులు చూపిస్తుండడంతో అవాక్కవుతున్నారు. వాహనాల తనిఖీ సమయంలో కేవలం పోలీసుల మొబైల్స్‌లోనే పెండింగ్ చలాన్లు కనిపిస్తున్నాయని, ఇప్పుడెలా అవి వచ్చాయో అర్ధం కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. అన్నింటినీ చెల్లిస్తేనే వాహనాలు విడిచిపెడతామని ఒత్తిడి చేస్తుండడంతో వారంతా వారంతా గగ్గోలు పెడుతున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్లు జారీచేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే వారిని పోలీసులు ఏదైనా కూడలివద్ద పట్టుకుని అక్కడికక్కడే జరిమానా విధించేవారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ చలాన్ విధానం అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారి ఫొటోలు పోలీసులు సెల్‌ఫోన్‌లో పోలీస్‌శాఖ నియమించిన ఏజెన్సీకి ప్రత్యేకయాప్‌లో అప్‌లోడ్‌చేస్తారు. రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను కమాండ్ కంట్రోల్‌రూమ్ నుంచి పర్యవేక్షించి ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌చేస్తుంటారు.
ట్రాఫిక్ ఈ చలాన్లు జారీచేసేందుకు పోలీస్‌శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీ సిబ్బంది యాప్‌ద్వారా పంపించిన ఫొటోలను పరిశీలించి, రవాణాశాఖ అందజేసిన వాహనాల డేటా ఆధారంగా వాహనం యజమాని సెల్‌ఫోన్ నంబరుకు ఉల్లంఘనకు సంబంధించిన ఫొటో, ప్రదేశం, చెల్లించాల్సిన జరిమానా ఎస్‌ఎంఎస్ రూపంలో పంపిస్తారు. వాహన యజమాని జరిమానా మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు గత పదేళ్లుగా ఇదే విధానం అమల్లో ఉంది.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సుమారు తొమ్మిది లక్షల వాహనాలకు రూ.50 కోట్లు జరిమానా విధిస్తూ ఈ-చాలాన్లు జారీచేశారు. కాగా 16 నెలలకు ముందు విఽధించిన ట్రాఫిక్ ఈ-చాలాన్‌ల డేటా ఆన్‌లైన్ నుంచి మాయమైపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడేసరికి రాష్ట్రంలో ఒక ఏజెన్సీ ట్రాఫిక్ ఈ-చాలాన్ జారీ బాధ్యతలు చూసేది. వసూళ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాతే పెండింగ్ ట్రాఫిక్ ఈ చలాన్ల డేటా ఆన్‌లైన్‌లో డిలీట్ అయిపోయింది. దీంతో ఆ తరువాత డేటా మాత్రమే ఆన్‌లైన్‌లో కనిపించేవి. అంతకుముందు పెండింగ్ చాలాన్‌లు ఉన్నవారికి అవి కనిపించకపోవడంతో ధీమాగా ఉన్నారు.
పాత చలాన్లు ప్రత్యక్షం
గత 16 నెలలు ముందు ఆన్‌లైన్‌లో పెండింగ్ చాలాన్లు డేటా డిలీట్ అయిపోగా, తాజాగా రెండు, మూడేళ్ల కిందట జారీ అయినవి ప్రత్యక్షమవుతున్నాయి. పోలీసులు వాహనాల తనిఖీ సమయంలో వీటిని వాహన చోదకులకు చూపించి, చెల్లించకపోతే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ చలాన్లు లేవని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ పరివాహన్ యాప్‌లో పెండింగ్ చలాన్లు చూపిస్తుండడంతో నీళ్లు నమలుతున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులను వివరణ కోరగా గతంలో డిలీట్ అయిన డేటాను రికవరీ చేసి ఉంటారని చెబుతున్నారు.