Share News

వైసీపీలో కలవరం

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:14 AM

పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి డ్రగ్స్‌ కేసులో ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడడం వైసీపీలో కలకలం రేపుతోంది.

వైసీపీలో కలవరం

డ్రగ్స్‌తో పట్టుబడిన పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి

అతడికి పలువురు నేతలతో లింకులు

డ్రగ్స్‌ కూడా సరఫరా చేసేవాడని ప్రచారం

కాల్‌డేటా ఆధారంగా కొంత మందిని విచారించే అవకాశం

నాలుగు నెలల కిందట పద్మనాభం వద్ద ఒక నేత ఇచ్చిన పార్టీలో డ్రగ్స్‌ వినియోగం

ఆ పార్టీకి చాలామంది హాజరు

దీనిపై పూర్తిస్థాయిలో కూపీలాగుతున్న పోలీసులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి డ్రగ్స్‌ కేసులో ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడడం వైసీపీలో కలకలం రేపుతోంది. కొండారెడ్డి చాలాకాలంగా డ్రగ్స్‌ వినియోగించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో అతనితో సన్నిహితంగా ఉంటూ డ్రగ్స్‌ను వాడిన నేతలు కంగారుపడుతున్నారు. ఏ క్షణంలో పోలీసులు తమను పిలుస్తారోనని ఆందోళన చెందుతున్నారు. నగరానికి చెందిన పార్టీ యువజన విభాగం నేత ఒకరు సోమవారం ఇక్కడకు రావాల్సి ఉన్నప్పటికీ ఈ కేసు విషయం తెలియగానే హైదరాబాద్‌లో ఉండిపోయారంటున్నారు.

బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను తీసుకొస్తుండగా ముగ్గురు యువకులను ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి ఉండడం, అతనే డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తెప్పించి, ఇతరులకు విక్రయిస్తున ్నట్టు విచారణలో తేలడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కొండారెడ్డికి చాలాకాలంగా డ్రగ్స్‌ను సేవించే అలవాటు ఉండడంతోపాటు పార్టీలోని కొందరు నేతలకు సరఫరా చేస్తున్నట్టు చెబుతున్నారు. కొండారెడ్డి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా అతడి ద్వారా డ్రగ్స్‌ పొందిన వారందరినీ అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించడంతో వారంతా జాగ్రత్తపడే పనిలో నిమగ్నమయ్యారని చెబుతున్నారు. పార్టీ యువజన విభాగంలో ఉన్నత స్థానంలో ఉన్న నగరానికి చెందిన నేత ఒకరికి కొండారెడ్డితో సత్సంబంధాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సదరు నేత నాలుగు నెలల కిందట పద్మనాభం వద్ద ఒక రిసార్టులో పార్టీ ఏర్పాటుచేశారని, ఆ సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సింథటిక్‌ డ్రగ్స్‌ను వాడారని ఆ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. తాము కూడా ఆ పార్టీకి హాజరయ్యామని, కానీ భోజనం చేసిన తర్వాత వచ్చేశామని, అర్ధరాత్రి తర్వాత డ్రగ్స్‌ వినియోగించినట్టు తమకు తర్వాత తెలిసిందని నగరానికి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా రెండు రోజుల కిందట హైదరాబాద్‌ వెళ్లిన ఒక నేత సోమవారం నగరానికి రావాల్సి ఉన్నప్పటికీ కొండారెడ్డి వ్యవహారం బయటపడడంతో...అక్కడే ఉండిపోయినట్టు చెబుతున్నారు. కొండారెడ్డితో సత్సంబంధాలు కలిగివున్నవారు పార్టీలో చాలామంది ఉన్నారని, కీలకంగా వ్యవహరిస్తున్న ఒక నేతకు అతను భారీగా ఖర్చుపెడుతుంటాడని అంటున్నారు. వచ్చే నెలలో కొండారెడ్డి పుట్టినరోజు ఉందని, ఆరోజు పార్టీ నేతలకు భారీ పార్టీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేశాడని, దానికోసమే డ్రగ్స్‌ను తెప్పించినట్టున్నాడని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కొండారెడ్డితోపాటు అరెస్టు అయిన ఇద్దరినీ త్వరలో కస్టడీకి తీసుకుంటామని, పూర్తిస్థాయిలో విచారిస్తే వారితో సంబంధాలు కలిగివున్నవారంతా బయటకు వస్తారని డీసీపీ మేరీప్రశాంతి ప్రకటించారు.

Updated Date - Nov 04 , 2025 | 01:14 AM