గ్రేటర్‌లో గందరగోళం
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:16 AM
జీవీఎంసీ అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు విమర్శలకు దారితీస్తున్నాయి.
ఇంజనీరింగ్ విభాగంలోని డ్రాయింగ్ బ్రాంచ్‌లన్నీ ఏడాది క్రితం జోనల్ కార్యాలయాలకు తరలింపు
అందుకోసం ఒక్కో జోన్‌లో రూ.50 లక్షల వరకూ వ్యయం
ఇప్పుడు మళ్లీ మెయిన్ ఆఫీస్‌కు మార్చాల్సిందిగా చీఫ్ ఇంజనీర్ ఆదేశాలు
కాంట్రాక్టర్ల సౌలభ్యం కోసమేననే ఆరోపణలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో పరిపాలనా సౌలభ్యం పేరుతో ప్రధాన కార్యాలయంలో ఉన్న డ్రాయింగ్ బ్రాంచ్ (డీబీ)లను ఏడాది కిందట సంబంధిత జోనల్ కార్యాలయాలకు తరలించారు. అందుకోసం రూ.లక్షలు వెచ్చించి అక్కడ సదుపాయాలు కల్పించారు. తాజాగా వాటన్నింటినీ అక్కడి నుంచి ప్రధాన కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగానికి మార్చాలని ఆదేశాలు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.
జీవీఎంసీ పరిధిలో ఏటా రూ.500 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. నగర పాలక సంస్థ పరిధిలో ఎనిమిది జోన్‌లు ఉండగా, ఆయా జోన్‌ల పరిధిలో పనులను పర్యవేక్షించేందుకు ఒక్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) జోనల్ కార్యాలయంలోనే ఉంటారు. పనులకు సంబంధించిన అంచనాల తయారీ, టెండర్లు పిలవడంతో సహాయంగా డ్రాయింగ్ బ్రాంచ్‌లు ఈఈ ఆధ్వర్యంలో ఉంటాయి. డీబీలన్నీ గతంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో ఉండేవి. జోనల్ కార్యాలయాల నుంచి ఈఈలు ప్రధాన కార్యాలయానికి వచ్చి డీబీల వద్ద కూర్చొని పనులు పూర్తిచేయించుకోవడం, తిరిగి జోనల్ కార్యాలయాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. దీంతో డీబీలు జోనల్ కార్యాలయంలో ఉంటే ఈఈలకు సౌలభ్యంగా ఉండడంతోపాటు కావాల్సిన సమాచారం సకాలంలో అందుబాటులో ఉంటుందని భావించి ఏడాది కిందట అప్పటి చీఫ్ ఇంజనీర్ రవికృష్ణరాజు వాటిని తరలించారు. జోనల్ కార్యాలయాల్లో డీబీలు కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా అవసరమైన ఫర్నీచర్, సివిల్ వర్కులు, ఎలక్ర్టికల్ పనుల కోసం సగటున రూ.50 లక్షలు వరకు ఖర్చు చేసినట్టు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ మార్పు ఇంజనీరింగ్ అధికారులకు, డీబీల్లో పనిచేసే సిబ్బందికి కూడా విధి నిర్వహణకు సౌకర్యంగా ఉండడంతోపాటు సమయం కూడా ఆదా అవడంతో పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి.
ఇదిలావుంటే డీబీలను ప్రధాన కార్యాలయం నుంచి జోనల్ కార్యాలయాలకు తరలించడం వల్ల అధికారులు, సిబ్బందికి సౌకర్యంగా ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్లకు మాత్రం కొంత ఇబ్బందిగా మారింది. కాంట్రాక్టర్లు ఏ జోన్ పరిధిలో వర్క్ చేస్తే ఆ జోనల్ కార్యాలయానికి వెళ్లి అక్కడి డీబీలతో తమ టెండర్లు, బిల్లులకు సంబంధించిన పనులు ఎంతవరకు జరిగాయి? ఏస్థాయిలో ఉన్నాయనేది తెలుసుకోవాల్సి వస్తోంది. అదే ప్రధాన కార్యాలయంలో అన్ని జోన్‌ల డీబీలు ఉంటే ఒకచోట సమాచారం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని కొందరు కాంట్రాక్టర్లు భావించారు. అనుకున్నదే తడవుగా తమ ప్రతిపాదనను జీవీఎంసీ ఉన్నతాధికారుల ముందుంచారు. అప్పటికే ప్రధాన కార్యాలయం నుంచి జోనల్ కార్యాలయాలకు డీబీలు తరలించి, వాటికి మౌలిక వసతుల కోసం రూ.లక్షలు వ్యయం చేశామని వివరించి, కాంట్రాక్టర్ల ప్రతిపాదనను తిరస్కరించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. జోనల్ కార్యాలయల్లో డీబీల కోసం చేసిన ఖర్చు విషయాన్ని మరిచిపోయి, తక్షణం డీబీలను ప్రధాన కార్యాలయానికి తీసుకురావాలంటూ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. అధికారుల ఆదేశాలను జీవీఎంసీలోని ఇంజనీరింగ్ అధికారులే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంట్రాక్టర్లతో వ్యక్తిగత సంబంధాలు కారణంగానే అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తుండడం గమనార్హం.