Share News

కౌన్సెలింగ్‌లో గందరగోళం

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:33 AM

వార్డు సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీల బదిలీల కౌన్సెలింగ్‌ గందరగోళంగా మారింది.

కౌన్సెలింగ్‌లో గందరగోళం

మూడు ఆప్షన్ల విధానానికి వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీలు ససేమిరా

అధికారుల తీరుపై నిరసనగా కౌన్సెలింగ్‌ బహిష్కరణ

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

వార్డు సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీల బదిలీల కౌన్సెలింగ్‌ గందరగోళంగా మారింది. కౌన్సెలింగ్‌లో మూడు ఆప్షన్లు ఇవ్వాలని అధికారులు కోరడంతో వారంతా అభ్యంతరం తెలిపి, కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో యూసీడీ పీడీ సత్యవేణి ఆధ్వర్యంలో ఆదివారం వార్డు సచివాలయం సంక్షేమ కార్యదర్శుల కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. నగర పరిధిలోని 438 మంది సంక్షేమ కార్యదర్శులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వారిని పోస్టింగ్‌ కోసం మూడు సచివాలయాలు ఆప్షన్‌ ఇవ్వాలని, వాటిలో అందుబాటులో ఉన్న చోటకు బదిలీ చేస్తామని అధికారులు వివరించారు. దీనికి కార్యదర్శులు అభ్యంతరం తెలిపారు. కార్యదర్శుల సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి, అభ్యర్థులు కోరుకున్న సచివాలయంలో పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనివల్ల కౌన్సెలింగ్‌లో అక్రమాలకు తావుండదని, మూడు ఆప్షన్లు ఇస్తే ఎవరికి ఎక్కడ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంటుందన్నారు. అయితే అధికారులు మాత్రం మూడు ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయడంతో కౌన్సెలింగ్‌కు హాజరైనవారంతా అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌన్సెలింగ్‌ హాల్‌ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం కమిషనర్‌ చాంబర్‌ ఎదురుగా ఉన్న పోర్టికో వద్ద నిరసన తెలిపారు. చివరకు కొందరు కార్యదర్శులు మూడు ఆప్షన్లతో విల్లింగ్‌ లెటర్‌లను అందజేయడం విశేషం.

336 మంది సర్వేయర్లు, 443 మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బదిలీ

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ఆదివారం సర్వేయర్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఆవరణలో విశాఖ, అనకాపల్లి సర్వేశాఖ ఏడీలు సూర్యారావు,గోపాలరాజా ఆధ్వర్యంలో 336 మంది సర్వేయర్లకు బదిలీ చేశారు. మూడు జిల్లాల పరిధిలో బదిలీల ప్రక్రియ చేపట్టడంతో సచివాలయం ఎంపికకు ప్రతి ఉద్యోగికి ఐదు నుంచి పదిమిషాలు పడుతోంది. దీంతో రాత్రి వరకు కౌన్సెలింగ్‌ కొనసాగించారు.

జిల్లా పరిషత్‌ సమావేశమందిరంలో 443 మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్‌ జరిగింది. ఈ ప్రక్రియ ఉదయమే నిర్వహిస్తామని ప్రకటించడంతో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు వచ్చారు. మెరిట్‌ జాబితా ప్రకటించడానికి ఆలస్యమైంది. దీంతో సాయంత్రం కౌన్సెలింగ్‌ ప్రారంభించారు. బదిలీల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పలువురికి సిఫారసు లేఖలు ఇచ్చారు. కొందరు ఎమ్యెల్యేలు ఫోన్‌లు చేసి ఒత్తిడి తెచ్చారు. దీంతో బదిలీలపై కొందరు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు అనుమానం వ్యక్తంచేశారు.

Updated Date - Jun 30 , 2025 | 12:34 AM