Share News

ఆర్టీసీ ప్రయాణికుల అవస్థలు

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:22 PM

సీలేరు- తుని ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు బస్సు మార్గమధ్యంలో సాంకేతిక సమస్య కారణంగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఐదు గంటల పాటు అడవిలో అవస్థలు పడ్డారు.

ఆర్టీసీ ప్రయాణికుల అవస్థలు
మరో బస్సు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు

మార్గమధ్యంలో ఆగిపోయిన సీలేరు బస్సు

ఐదు గంటల పాటు పడిగాపులు

గూడెంకొత్తవీధి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): సీలేరు- తుని ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు బస్సు మార్గమధ్యంలో సాంకేతిక సమస్య కారణంగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఐదు గంటల పాటు అడవిలో అవస్థలు పడ్డారు. మంగళవారం ఉదయం నర్సీపట్నం ఆర్టీసీ డిపోకి చెందిన ఎక్స్‌ప్రెస్‌ తుని నుంచి సీలేరు బయలుదేరింది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో సంపంగిగొంది అటవీ ప్రాంతానికి చేరుకుంది. అయితే సాంకేతిక సమస్య వల్ల బస్సు నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో సెల్‌ సిగ్నల్స్‌ లేకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్‌ వేరే ప్రాంతానికి వెళ్లి ఫోన్‌లో నర్సీపట్నం డిపో అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్టీసీ అధికారులు మరో బస్సును పంపించారు. ఆ బస్సు రావడానికి మధ్యాహ్నం రెండు గంటలైంది. 30 మంది ప్రయాణికులు సుమారు ఐదు గంటల పాటు ఆహారం, మంచినీరు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ఘాట్‌ రోడ్డు ప్రాంతాలకు కండీషన్‌లో ఉన్న బస్సులను నడపాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Jun 03 , 2025 | 11:22 PM