ఆర్టీసీ సిబ్బందికి అవస్థలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:45 AM
ఆర్టీసీ దూరప్రాంత సర్వీసుల సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ఎంవీపీకాలనీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విశ్రాంతి భవనంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
ఎంవీపీ బస్టాండ్ లోని విశ్రాంతి భవనంలో కనీస వసతులు కరవు
రేకుల పైకప్పుతో నిత్యం వేడి వాతావరణం
తిరగని ఫ్యాన్లతో తీవ్ర ఉక్కపోత
దూరప్రాంత సర్వీసుల డ్రైవర్లకు తప్పని తిప్పలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
ఆర్టీసీ దూరప్రాంత సర్వీసుల సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ఎంవీపీకాలనీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విశ్రాంతి భవనంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సుధీర్ఘసమయం విధి నిర్వహణ చేసి విశ్రాంతి తీసుకునేందుకు భవనంలోకి వెళితే కనీసం కూర్చొనేందుకు కూడా అవకాశం లేకుండా పోతోందని సిబ్బంది వాపోతున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
విజయవాడ, అమలాపురం, రాజోలు, తాడేపల్లిగూడెం, తెనాలి డిపోల నుంచి నగరానికి కొన్ని ఆర్టీసీ బస్సులు వచ్చి, వెళుతుంటాయి. ఈ సర్వీసుల్లో డ్రైవర్లు, కండక్టర్లు సుమారు పది నుంచి 12 గంటలు పాటు ఏకధాటిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వారంతా నగరానికి చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ఎంవీపీబస్‌స్టేషన్ ఆవరణలో భవనం నిర్మించారు. బస్సులు ఇక్కడికిచేరుకున్న తర్వాత అప్పటివరకు విధులు నిర్వర్తించిన డ్రైవర్, కండక్టర్ విశ్రాంతి భవనంలో ఉండిపోతే, వారిస్థానంలో మరో డ్రైవర్, కండక్టర్ డ్యూటీ ఎక్కి బస్సుని తిరిగి విజయవాడ, అమలాపురం, రాజోలు, తాడేపల్లిగూడెం, తెనాలి వంటి దూర ప్రాంతాలకు వెళతారు. అక్కడి నుంచి వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు విశ్రాంతిభవనంలో నిద్రపోయి మరుసటిరోజు ఉదయం తిరిగి డ్యూటీ ఎక్కుతారు. అయితే విశ్రాంతి భవనంలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ భవనంలో 13 మంచాలు ఫ్యాన్‌లను ఏర్పాటుచేశారు. ఒకటి, రెండు మినహా మిగిలిన ఫ్యాన్‌లు తిరగడం లేదు. దీంతో తీవ్ర ఉక్కపోతతో సిబ్బంది సతమతమవుతున్నారు. మరోవైపు విశ్రాంతిభవనం పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మించడంతో చిన్నపాటి ఎండకాస్తే ఉక్కపోత, వేడిపెరిగిపోతోందని వాపోతున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదుచేసినా కనీసం స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూరప్రాంతాల నుంచి బస్సులో విధులు నిర్వర్తించి, విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కనీసం కూర్చోవడానికి కూడా అవకాశం లేని దుర్భర పరిసితులు నెలకొనడంతో, మరుసటిరోజు విధి నిర్వహణ సవాల్‌గా మారుతోందని వాపోతున్నారు. అధికారులు సిబ్బంది సంక్షేమంతో పాటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి భవనంలో సమస్యలను పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు.