హైడ్రో పవర్ ప్రాజెక్టులపై ఆందోళన ఉధృతం
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:15 PM
హైడ్రో పవర్ పంఫ్డ్ స్టోరేజి ప్రాజెక్టుతో గిరిజనుల జీవితాలను నాశనం చేయవద్దని గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు.
గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు చిన్నయ్య పడాల్
గిరిజనుల జీవితాలను నాశనం చేయవద్దు
తక్షణమే నిర్మాణాలు విరమించుకోవాలి
చింతపల్లి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):హైడ్రో పవర్ పంఫ్డ్ స్టోరేజి ప్రాజెక్టుతో గిరిజనుల జీవితాలను నాశనం చేయవద్దని గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. శుక్రవారం యర్రవరం హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా సమగిరి గ్రామంలో ఆదివాసీలు, గిరిజన సంఘం నాయకులు సంప్రదాయ ఆయుధాలతో అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గిరిజనుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పెసా కమిటీ తీర్మానం లేకుండా యర్రవరం హైడ్రో పవర్ పంప్డ్ ప్రాజెక్టుని అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్‌కి అప్పగించిందన్నారు. దీనికి వ్యతిరేకంగా అప్పట్లోనే ఆదివాసీలు ఆందోళనలు చేపట్టారని, ఈ ఆందోళనలకు టీడీపీ మద్దతిచ్చిందన్నారు. అయితే ఏడాది కాలంగా రహస్యంగా అధికారులు సర్వేలు నిర్వహించి, తుది నివేదికను ప్రభుత్వానికి పంపించారన్నారు. దీంతో హైడ్రో పవర్ పంప్డ్ ప్రాజెక్టు నిర్మాణాలకు ప్రభుత్వం జీవో నంబరు 51ని విడుదల చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే హైడ్రో పవర్ పంప్డ్ ప్రాజెక్టు నిర్మాణాల ఎంవోయూలను రద్దుచేయాలన్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కో-కన్వీనర్ గూడెపు రాజు, మాజీ సర్పంచ్ పొట్టుకూరి బెన్నాస్వామి, గ్రామ పెద్దలు సింగరి సత్తిబాబు, సెగ్గె సోమరాజు, చెర్రెకి వెంకటేశ్వర్లు, బాలన్న, సుబ్బారావు, మంగరాజు, చిన్నారావు పాల్గొన్నారు.