Share News

అన్నదాతల ఆందోళన

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:04 PM

మొంథా తుఫాన్‌ ప్రభావంతో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.

అన్నదాతల ఆందోళన
హుకుంపేట మండలం కొట్నాపల్లి వద్ద కోత దశకు వచ్చిన వరి పంట

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక

కోత దశకు చేరిన వరి పంట

పంట నాశనమవుతుందని గుబులు

తిండి గింజలకు ఇబ్బంది పడతామనే దిగులు

పాడేరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు అనుకూలంగా వర్షాలు కురిశాయి. దీంతో ఖరీఫ్‌లో వేసిన వరి, రాగులు, సామ, వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వరి 57,773 హెక్టార్లలోను, రాగులు 15,152, మొక్కజొన్న 2,517, వేరుశనగ 2,580 హెక్టార్లలో వేశారు. అలాగే గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాలు, 1,44,222 మందికి అన్నదాత సుఖీభవ పథకంలో రూ.7 వేలు పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది. ఈ ఏడాది గతంలో కంటే కాస్త ముందుగానూ వరి నాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే వరి పంట కోతకు వచ్చే దశకు చేరింది. మరో రెండు వారాల్లో వరి కోతలు ప్రారంభించాలనే ఆలోచనతో గిరిజన రైతులు ఉన్నారు. ఈక్రమంలో భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారం వారికి మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. ఏజెన్సీలో గిరిజనులకు ఖరీఫ్‌ సీజన్‌లో పండించే వరి పంటనే ప్రధాన ఆహారంగా వినియోగిస్తుంటారు. ఈక్రమంలో ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో వరి పంటకు నష్టం వాటిల్లితే తమకు ఆహార ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు అంటున్నారు. దీంతో తుఫాన్‌ అంటే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:04 PM