Share News

ఉక్కు ఉద్యోగుల ఆందోళన

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:43 AM

స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ఇకపై ఉత్పత్తి ఆధారంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు ఇస్తామని ప్రకటించడంపై కార్మిక సంఘాలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ను ఆశ్రయించి చట్టానికి విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరిస్తోందని, వెంటనే ఆ ఉత్తర్వుల రద్దుకు ఆదేశించాలని డిమాండ్‌ చేశాయి.

ఉక్కు ఉద్యోగుల ఆందోళన

ఉత్పత్తి ఆధారిత వేతనంపై

రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ను ఆశ్రయించిన కార్మిక సంఘాలు

యాజమాన్యం ఉత్తర్వుల రద్దుకు డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ఇకపై ఉత్పత్తి ఆధారంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు ఇస్తామని ప్రకటించడంపై కార్మిక సంఘాలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ను ఆశ్రయించి చట్టానికి విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరిస్తోందని, వెంటనే ఆ ఉత్తర్వుల రద్దుకు ఆదేశించాలని డిమాండ్‌ చేశాయి.

బకాయిలు అడిగితే...

స్టీల్‌ ప్లాంటు కార్మికులకు గత ఏడాదికాలంగా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. 2024 సెప్టెంబరు నుంచి సగం జీతాలు మాత్రమే ఇవ్వడం ప్రారంభించింది. అప్పటివరకూ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కోరిన సంఘాలు.. వాటిని పక్కనపెట్టి నెలనెలా జీతాలు ఇస్తే చాలు అనే స్థితికి వచ్చాయి. ఆందోళనలు ఉధృతం చేయడంతో ఆ తరువాత 65 శాతం, 75 శాతం జీతాలు ఇచ్చారు. మళ్లీ ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 100 శాతం ఇస్తున్నారు. కేవలం రెండు నెలలు ఇచ్చి ఇప్పుడు ఉత్పత్తి ఆధారంగా ఇస్తామని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు వరకు లెక్క చూసుకుంటే ఉద్యోగులు, కార్మికులకు 355 శాతం జీతాలు అంటే సుమారుగా రూ.350 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని కోరుతుంటే...నవంబరు నుంచి ఎంత ఉత్పత్తి తీస్తే అంతే జీతాలు అని ప్రకటించారు. దీంతో పుండు మీద కారం రాసినట్టు అయింది.

దేశంలో ఎక్కడా లేదు

ఉత్పత్తికి అనుగుణంగా జీతాలు ఇచ్చే విధానం దేశంలో ఏ స్టీల్‌ప్లాంటులోనూ లేదు. పైగా ఇక్కడ పూర్తిస్థాయి ఉత్పత్తితో ప్లాంటును నడిపేందుకు అవసరమైన వనరులు యాజమాన్యం వద్ద లేవు. యంత్ర పరికరాలు అందుకు అనుగుణంగా లేవు. నిర్వహణ పనులు ఆపేశారు. అనేక విభాగాలు మరమ్మతుల్లో ఉన్నాయి. రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటులో మంగళవారం బెల్ట్‌ తెగిపోయింది. దానివల్ల మూడు రోజులు ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉంది.

డిమాండ్‌లతో కూడిన

బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు

నేడు, రేపు ధర్నాలు

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

ఉత్పత్తి ఆధారిత జీతాలపై యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వులను విరమించుకోవాలని, ఇంకా పలు డిమాండ్‌లతో కూడిన బ్యాడ్జీలు ఽధరించి ఉక్కు ఉద్యోగులు బుధవారం విధులకు హాజరయ్యారు. ఉత్పత్తితో వేతనాలను ముడిపెట్టవద్దని, పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని, ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనే డిమాండ్‌లతో కూడిన బ్యాడ్జీలు ధరించారు. యాజమాన్యం తీరుకు నిరసనగా గురువారం ప్లాంటు బీసీ గేటు ముందు, శుక్రవారం జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపడతామని ఉక్కు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. ధర్నాలో భారీగా ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - Nov 20 , 2025 | 01:43 AM