Share News

సచివాలయాల్లో కంప్యూటర్లు మొరాయింపు

ABN , Publish Date - May 23 , 2025 | 01:27 AM

జిల్లాలో మూడింట ఒక వంతు గ్రామ/వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు మూలకు చేరాయి.

సచివాలయాల్లో కంప్యూటర్లు మొరాయింపు

ప్రింటర్లకు టోనర్లు, స్టేషనరీ కొరత

సేవలకు ఆటంకం

కొత్తవాటి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన

విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో మూడింట ఒక వంతు గ్రామ/వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు మూలకు చేరాయి. వార్డు/గ్రామ సచివాలయాలను ప్రారంభించినప్పుడు కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నీచర్‌, స్టేషనరీ అందజేశారు. అయితే వాటి నిర్వహణపై తగినంత దృష్టిసారించకపోవడంతో కంప్యూటర్లు, ప్రింటర్లు మరమ్మతులకు గురవుతున్నాయి. జిల్లాలో మొత్తం 607 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా...వాటిలో 220 చోట్ల కంప్యూటర్లు, 200 చోట్ల ప్రింటర్లు పనిచేయడం లేదు. మిగిలినచోట్ల కంప్యూటర్లు ఎప్పటికప్పుడు మొరాయిస్తున్నాయి. ప్రింటర్లకు టోనర్లు, పేపరు సరఫరా నిలిపివేశారు. కాగా కంప్యూటర్లు పనిచేయనిచోట సిబ్బంది సొంతంగా ల్యాప్‌టాప్‌లు తెచ్చుకుంటున్నారు. కంప్యూటర్లు/ల్యాప్‌టాప్‌లతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, సేవలకు సంబంధించి ప్రింట్‌ ఇవ్వకపోవడంతో సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోల శ్రీబాలవీరాంజనేయస్వామి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. ఆయన సూచన మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కొత్తగా కంప్యూటర్లు, ప్రింటర్లు, స్టేషనరీ సరఫరా చేయాలని కోరారు.

Updated Date - May 23 , 2025 | 01:27 AM