విపత్తుల నిర్వహణకు సమగ్ర ప్రణాళిక
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:31 AM
మొంథా తుఫాన్‌ను ఎదుర్కొన్న అనుభవాలతో భవిష్యత్తులో విపత్తుల నిర్వహణకు మరింత సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా, మండల ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా, మండల ప్రత్యేకాధికారులు సిబ్బందితో కలిసి సమష్టిగా కృషి చేయడం వలన ఎటువంటి ప్రాణహాని జరగకుండా నివారించగలిగామన్నారు. తుఫాన్ కాలంలో అహర్నిశలు శ్రమించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
- తుఫాన్ సహాయక చర్యలు అభినందనీయం
- కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ను ఎదుర్కొన్న అనుభవాలతో భవిష్యత్తులో విపత్తుల నిర్వహణకు మరింత సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా, మండల ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా, మండల ప్రత్యేకాధికారులు సిబ్బందితో కలిసి సమష్టిగా కృషి చేయడం వలన ఎటువంటి ప్రాణహాని జరగకుండా నివారించగలిగామన్నారు. తుఫాన్ కాలంలో అహర్నిశలు శ్రమించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. విద్యుత్ శాఖాధికారులు ముందుగా సిద్ధం చేసుకున్న పరికరాలతో ఎక్కడా విద్యుత్ సమస్య తలెత్తకుండా చేయగలిగారన్నారు. వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రుల్లో చేర్పించి సుఖ ప్రసవం జరిగేలా తోడ్పాటు అందించారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు నిరంతరాయంగా జలాశయాల వద్ద నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతూ ప్రమాదాలు జరగకుండా పనిచేశారన్నారు. రెవెన్యూ, పోలీసు, ఇతరత్రా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పని చేయడం గొప్ప విషయమన్నారు. అధికారుల ద్వారా అనుభవాలను తెలుసుకున్న కలెక్టర్ భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు ఎదురైనా మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో ప్లాస్టిక్ అతి పెద్ద సమస్యగా మారిందని, ప్లాస్టిక్ కవర్లు, సీసాలు వలన కాలువల్లో చెత్త పేరుకుపోయి మూసుకుపోతున్నాయన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.