Share News

గర్భిణులకు అందని సంపూర్ణ వైద్య సేవలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:15 PM

వైద్య విధాన పరిషత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందడం లేదు.

గర్భిణులకు అందని సంపూర్ణ వైద్య సేవలు
నిరుపయోగంగా ఉన్న అలా్ట్రసౌండ్‌ మిషన్‌

సీహెచ్‌సీలో నిలిచిపోయిన అలా్ట్రసాండ్‌ పరీక్షలు

ఏడు నెలలుగా గైనకాలజిస్టు పోస్టు ఖాళీ

భర్తీ చేయని వైద్య విధాన పరిషత్‌ అధికారులు

అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌కు

పాడేరు వెళ్లాల్సిన దుస్థితి

గర్భిణులకు తప్పని అవస్థలు

ముంచంగిపుట్టు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : వైద్య విధాన పరిషత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందడం లేదు. గిరిజన ప్రాంతంలో మాతా శిశు మరణాల నివారణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. స్థానిక సీహెచ్‌సీలో అల్ర్టాసౌండ్‌ స్కానింగ్‌ చేయకపోవడంతో గర్భిణులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే..

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో గత ఏడు నెలలుగా అలా్ట్రసౌండ్‌ పరీక్షలు జరగడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి అలా్ట్రసౌండ్‌ టెస్టులకు వచ్చే గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మంగళవారం, గురువారం గర్భిణులకు అలా్ట్రసౌండ్‌ పరీక్షలను చేసి గర్భంలో శిశువు పరిమాణం, గుండె స్పందన, కడుపులో ఉండే విధానం, శిశువు ఆరోగ్య పరిస్థితిని స్కాన్‌ ద్వారా వైద్యులు గుర్తించేవారు. అవసరమైన గర్భిణులకు వైద్యులు పలు సలహాలు, సూచనలు చేసేవారు. గత ఏడాది నవంబరు నెల నుంచి సీహెచ్‌సీలో స్కానింగ్‌లు జరగడం లేదు. సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్‌ లేకపోవడంతో పాడేరు జిల్లా ఆస్పత్రి నుంచి గైనకాలజిస్టు నెలకు రెండు రోజులు వచ్చి గర్భిణులకు స్కానింగ్‌లు తీసేవారు. గత కొన్ని నెలలుగా స్కానింగ్‌లు ఇక్కడ తీయడంలేదు. దీంతో వైద్యుల సూచనల మేరకు 52 కిలోమీటర్ల దూరంలో గల పాడేరు జిల్లా ఆసుపత్రికి వెళ్లి అలా్ట్రసౌండ్‌ పరీక్షలు చేసుకోవల్సి వస్తుందని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి వచ్చేందుకు కొండలు.. కోనలు .. దాటుతూ పదుల కిలోమీటర్లు కాలినడకన రావల్సి వస్తుందని, ఇక్కడ నుంచి మరో 52 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేయాల్సి రావడంతో అలసిపోతున్నామని వారు వాపోతున్నారు. డబ్బులు ఖర్చుతోపాటు శ్రమ పడిపోతున్నామని గర్భిణులు అంటున్నారు. పాడేరు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేనివారు ముంచంగిపుట్టు సీహెచ్‌సీ నుంచి ఇంటికి వెళుతున్నారు. గైనకాలజిస్ట్‌ లేకపోవడంతో అలా్ట్రసాండ్‌ పరీక్షలకు తరచూ అవరోధం ఏర్పడుతుంది. ప్రతి నెలా 50 నుంచి 60 మంది వరకు గర్భిణులు అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ కోసం సీహెచ్‌సీకి వస్తుంటారు. మహిళలు గర్భం దాల్చిన నుంచి ప్రసవం అయ్యే వరకు తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితి, ఇతర ఆరోగ్య సమస్యలను తెలుసుకొనేందుకు ఉపయోగించే అలా్ట్రసౌండ్‌ పరీక్షలు సీహెచ్‌సీలో జరగడంలేదని సంబంధిత అధికారులకు తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. వైద్య విధాన పరిషత్‌ అధికారులు స్పందించి గైనకాలజిస్ట్‌ను నియమించాలని, అలా్ట్రసౌండ్‌ పరీక్షలు జరిగే విధంగా చూడాలని గర్భిణులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

ఇక్కడే స్కానింగ్‌ చేయాలి

జర్సింగి లక్ష్మి, గర్భిణి

అర్లాబు, పెదబయలు మండలం

ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో అలా్ట్రసాండ్‌ పరీక్షలు జరిగే విధంగా చూడాలి. ఎనిమిది నెలలు నిండడంతో ఆశా వర్కర్‌ సహాయంతో స్కానింగ్‌ చేయించుకొనేందుకు సీహెచ్‌సీకి వచ్చాను. ప్రస్తుతం ఇక్కడ స్కానింగ్‌ తీయడంలేదని, పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడికి వెళ్లేందుకు తలకు మించిన భారంగా ఉంటుంది. అందుబాటులో స్కానింగ్‌ పరీక్షలు జరిగే విధంగా అధికారులు చూస్తే బాగుంటుంది.

గైనకాలజిస్ట్‌ని నియమించాలి

కె.త్రినాథ్‌, గిరిజన సంఘం జిల్లా నేత

సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్‌ను వెంటనే నియమించాలి. ఆ పోస్టు గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నా వైద్య విధాన పరిషత్‌ అధికారులు భర్తీ చేయకపోవడం విచారకరం. సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్‌ లేకపోవడం, అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ పరీక్షలు జరగకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందించాలి.

Updated Date - Jun 07 , 2025 | 11:15 PM