యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Jun 10 , 2025 | 02:01 AM
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.

నిత్య సాధనతో ప్రశాంత జీవనం
కలెక్టర్ విజయకృష్ణన్
కొత్తూరు బౌద్ధ ఆరామం వద్ద యోగాంధ్ర
రాంబిల్లి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి):
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందస్తు సన్నాహాల్లో భాగంగా సోమవారం మండలంలో కొత్తూరు వద్ద వున్న బౌద్ధ ఆరామం (ధన దిబ్బలు) వద్ద యోగాంధ్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో యోగా నేర్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నదని, వయో, లింగభేదం లేకుండా ప్రజలంతా నిత్యం యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతోపాటు ప్రశాంత జీవన శైలి సొంతమవుతుందన్నారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని, యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రాచీన బౌద్ధ ఆరామం వద్ద యోగా కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందన్నారు. ఈ నెల 12న అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లో నిర్వహించే జిల్లాస్థాయి యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనిఇ విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బౌద్ధ ఆరామం నుంచి కొత్తూరు గ్రామం వరకు యోగాంధ్రపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీపీవో శిరీషారాణి, డీఎల్‌డీఓ మంజులావాణి, అనకాపల్లి ఆర్డీఓ ఆయీషా బేగమ్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె.లావణ్య, జిల్లా పర్యాటక అధికారి కె.మనోరమ, నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పలు శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు...