Share News

కూటమిలో పోటీ

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:00 AM

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కూటమి పార్టీల్లో హడావిడి మొదలైంది.

కూటమిలో పోటీ

  • జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్‌

  • ఈ ఏడు నెలలూ తమనే కొనసాగించాలని మేయర్‌, ఎమ్మెల్యేలకు ప్రస్తుత కమిటీ సభ్యుల విజ్ఞప్తి

  • ఈసారైనా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న టీడీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు

  • నాలుగు స్థానాలు అడుగుతున్న జనసేన

  • రెండింటిపై బీజేపీ పట్టు

  • పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న వైసీపీ

  • నామినేషన్లకు 29 వరకూ అవకాశం

విశాఖపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కూటమి పార్టీల్లో హడావిడి మొదలైంది. ప్రస్తుత స్టాండింగ్‌ కమిటీ కాలపరిమితి వచ్చే నెల ఆరో తేదీతో ముగుస్తుండడంతో కొత్త కమిటీ ఎన్నికకు కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సోమవారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. వచ్చే నెల ఆరున కొత్త కమిటీ ఎన్నిక నిర్వహించనున్నారు. సోమవారం నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.

జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది మార్చి పదో తేదీతో ముగియనున్నది. కొత్తగా ఎన్నికయ్యే స్టాండింగ్‌ కమిటీ పదవీకాలం కూడా అప్పటితోనే ముగుస్తుంది. ఏడు నెలలు మాత్రమే కొనసాగే కొత్త కమిటీకి మరోసారి ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవంగా తమనే ఎన్నుకోవాలని ప్రస్తుత స్టాండింగ్‌కమిటీ సభ్యులు కోరుతున్నారు. తాము ఎన్నికైన వెంటనే స్టానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని, ఆ ఆ తర్వాత జీవీఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాస తీర్మానం, కొత్త మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వంటి ప్రక్రియల కారణంగా తమ కమిటీ కేవలం 12 సార్లు మాత్రమే సమావేశమైందని, మిగిలిన ఏడు నెలలకు తమనే కొనసాగించాలని మేయర్‌ పీలా శ్రీనివాసరావుతోపాటు కూటమి ఎమ్మెల్యేలను కోరారు. మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు కొందరు తాము ఇంతవరకూ ఎలాంటి పదవులను చేపట్టనందున ఏడు నెలలు అయినా స్టాండింగ్‌ కమిటీ సభ్యునిగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ తమ నియోజకవర్గాల శాసనసభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే జనసేన, బీజేపీ కార్పొరేటర్లు సైతం స్టాండింగ్‌ కమిటీలో సభ్వత్వం కోసం పోటీపడుతున్నారు. పది స్థానాల్లో తమకు కనీసం నాలుగైనా కేటాయించాలని జనసేన నేతలు కోరుతుండగా, బీజేపీ రెండు స్థానాలు కోరుతున్నట్టు తెలిసింది. దీంతో ఏం చేయాలనే దానిపై మేయర్‌ పీలా శ్రీనివాసరావుతోపాటు ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలపై వైసీపీ నేతలు ఇంతవరకూ నోరువిప్పడం లేదు. కూటమి పార్టీల్లో పరిస్థితిని బట్టి తాము అడుగులు వేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లు ఉండగా కూటమికి 63 మంది బలం ఉండగా, వైసీపీకి 34 మంది బలం ఉంది. స్టాండింగ్‌ కమిటీ సభ్యునిగా ఎన్నికవ్వాలంటే కనీసం 44 ఓట్లు అవసరం. కూటమి పార్టీల కార్పొరేటర్లలో అసంతృప్తులు ఉన్నా, రెబల్స్‌గా ఎవరైనా పోటీకి దిగినాసరే వైసీపీ పోటీలో నిలబడే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు 29 వరకూ అవకాశం ఉండడంతో అప్పటివరకూ వేచిచూడాల్సిందేనని కార్పొరేటర్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 23 , 2025 | 01:00 AM