గిరిజన సాధికారతకు కట్టుబడి ఉన్నా
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:09 AM
ఏజెన్సీ అభివృద్ధికి, గిరిజనుల సాధికారతకు తాను కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఏజెన్సీ అభివృద్ధికి కృషిచేస్తా
ఎకో టూరిజానికి రూ.10 కోట్లు
మోదకొండమ్మ ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు
ఏజెన్సీ అందాలు ఎంతో ఆకట్టుకున్నాయి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రకటన
పాడేరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):
ఏజెన్సీ అభివృద్ధికి, గిరిజనుల సాధికారతకు తాను కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిశపల్లిలో శనివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగం ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తామన్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. పాడేరు మోదకొండమ్మ ఆలయం అభివృద్ధికి రెండు కోట్లు కావాలని అడిగారని, వాటిని ఇస్తానని హామీ ఇచ్చారు. పాడేరు రావడం తన అదృష్టంగా సీఎం పేర్కొన్నారు. ఏజెన్సీ అందాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. ఇక్కడికి వస్తే ఆనందంతో పాటు ధైర్యం కూడా వస్తుందన్నారు. ఇక్కడి ప్రజలు కూడా మంచివారని, వారి మనసుల్లో ఎటువంటి కలుషితం లేదన్నారు. సంపద అభివృద్ధి చేయడానికి అన్ని వసతులు ఉన్నాయని, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. పాడేరు దిశ, దశ మారేలా తాను అభివృద్ధి చేస్తానన్నారు. పాడేరులో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తెస్తానన్నారు. ఏజెన్సీకి రావడానికి డాక్టర్లు ఆసక్తి చూపడం లేదని, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి రప్పిస్తామన్నారు. దీపం పథకం ఈ ప్రాంత ప్రజలకు అందలేదని ఆలస్యంగా తెలిసిందని, ఈ నెలలోనే అందరికీ ఉచితంగా గ్యాస్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో ఆరు లక్షల ఎకరాల్లో వెదురు ఉందని, అది డ్వాక్రా గ్రూపులకు ఉపయోగపడేలా ప్రాజెక్టుకు ఎంఓయూ చేశామని, దీని వల్ల ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని, ఒక్కొక్కరికి ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం వస్తుందన్నారు.