ఇంజనీరింగ్‌లో అక్రమాలపై కమిషనర్ దృష్టి
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:55 AM
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై కమిషనర్ కేతన్‌గార్గ్ దృష్టిసారించారు.
పనుల నాణ్యత, రికార్డింగ్‌లో పారదర్శకత ఉండేలా చర్యలు
వార్డు ఎమినిటీ కార్యదర్శులకు ఎంబుక్ రికార్డింగ్ బాధ్యత
ఆపై ఏఈలు ఇతర అధికారుల పర్యవేక్షణ
బిల్లు ఫైల్‌పై ఎమినిటీ సెక్రటరీ సంతకం లేకుంటే తిరస్కరణ
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై కమిషనర్ కేతన్‌గార్గ్ దృష్టిసారించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఏఈ) కొరత కారణంగా వార్డుల్లో జరిగే అభివృద్ధి పనుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీనివల్ల పనుల్లో నాణ్యత లోపించడంతోపాటు చేసిన పనిని పక్కాగా కొలతలు వేయకుండానే ఎంబుక్ రికార్డు చేసేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి అడ్డుకట్టవేసేందుకు ఇకపై వార్డుస్థాయిలో జరిగే అన్నిరకాల అభివృద్ధి పనుల పర్యవేక్షణ, ఎంబుక్ రికార్డింగ్ వంటి బాధ్యతలను వార్డు సచివాలయం ఎమినిటీ సెక్రటరీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జీవీఎంసీ పరిధిలో ఏటా సగటున రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. వార్డుల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, తారు రోడ్లు, రక్షణ గోడలు, సామాజిక భవనాలు, పైప్‌లైన్ల నిర్మాణం, సుందరీకరణ వంటి పనులు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. వాటిని వార్డు పరిధిలోని వర్క్‌ఇన్‌స్పెక్టర్లు/ఏఈల సమక్షంలో కాంట్రాక్టర్లు చేపట్టాలి. నాణ్యత తగ్గకుండా ఒప్పందంలో పేర్కొన్న మాదిరిగా పనులు జరిగేలా పర్యవేక్షించాలి. అయితే వర్క్‌ఇన్‌స్పెక్టర్లు/ఏఈల కొరత కారణంగా ఐదారు వార్డులకు ఒక వర్క్‌ఇన్‌స్పెక్టర్/ ఏఈ బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీనివల్ల జరిగే ప్రతి పనిని దగ్గరుండి పర్యవేక్షించడం, పూర్తిచేసిన పనికి పక్కాగా కొలతలు వేసి ఎంబుక్‌లో రికార్డుచేయడం సాధ్యపడడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు లేకపోయినా కాంట్రాక్టరే పనులను పూర్తిచేసేస్తున్నారు. తర్వాత ఎంబుక్ రికార్డింగ్ కోసం ఒత్తిడి చేస్తుండడంతో ఆదరాబాదరాగా కొలతలువేసి ప్రక్రియను పూర్తిచేసి, బిల్లు కోసం ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. దీనివల్ల పనుల్లో నాణ్యత కొరవడడంతో పాటు చేసిన పనికంటే ఎక్కువ పనికి బిల్లు చెల్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రంగంలోకి కమిషనర్
ఈ నేపథ్యంలో కమిషనర్ కేతన్‌గార్గ్ వీటికి అడ్డుకట్టవేసేందుకు వీలుగా వార్డు సచివాలయంలోని ఎమినిటీ సెక్రటరీలను ఇంజనీరింగ్ పనుల్లో భాగస్వాములుగా చేర్చారు. వార్డు సచివాలయం పరిధిలో జరిగే అభివృద్ధి పనులను సంబంధిత ఎమినిటీ సెక్రటరీ స్వయంగా పర్యవేక్షించడంతోపాటు నాణ్యత లేకుండా పనులుచేస్తే దానిపై అధికారికంగా అభ్యంతరం తెలపడంతోపాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. అలాగే ఎంబుక్ రికార్డింగ్ బాధ్యతను ముందుగా వార్డు ఎమినిటీ సెక్రటరీలకే అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. వారు ఎంబుక్‌లో రికార్డుచేసిన తర్వాత ఏఈలు ఆ పైఅధికారులు దానిని తనిఖీచేసి బిల్లు ఫైల్ పెట్టాల్సి ఉంటుంది. ఆ ఫైల్‌ను వార్డు ఎమినిటీ సెక్రటరీ రికమెండ్ చేసినట్టు సంతకం తప్పకుండా పెట్టాల్సిందేనని కమిషనర్ స్పష్టంచేశారు. ఒకవేళ ఎమినిటీ సెక్రటరీ సంతకం లేకుండా బిల్లు కోసం వచ్చే ఫైల్‌ను తిరిగి వెనక్కిపంపించేస్తానని కమిషనర్ స్పష్టంచేశారు. దీనివల్ల కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కవుపోతారనే ఆరోపణలతోపాటు పనుల్లో అక్రమాలకు చెక్‌పెట్టినట్టవుతుందన్నది కమిషనర్ ఉద్దేశం. ఒకవేళ ఏదైనా ఫైల్‌ను చూసినపుడు కమిషనర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఎవరైనా ర్యాండమ్ తనిఖీల్లో ఏదైనా లోపం కనిపిస్తే సంబంధిత ఎమినిటీ సెక్రటరీ, ఏఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనివల్ల అవినీతి ఆస్కారం లేకుండా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.