స్టాండింగ్ కమిటీలో కమీషన్ లొల్లి
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:21 AM
కాంట్రాక్టర్ల నుంచి వసూలుచేసిన కమీషన్‌ల పంపిణీ విషయమై స్టాండింగ్ కమిటీలో అంతర్గత పోరు నడుస్తున్నట్టు జీవీఎంసీ చర్చ జరుగుతోంది.
కాంట్రాక్టర్ల నుంచి పది శాతం వసూలు?
వాటాల పంపిణీలో విభేదాలు
ప్రైవేటు వ్యక్తి జోక్యం
సభ్యుల ఆగ్రహం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కాంట్రాక్టర్ల నుంచి వసూలుచేసిన కమీషన్‌ల పంపిణీ విషయమై స్టాండింగ్ కమిటీలో అంతర్గత పోరు నడుస్తున్నట్టు జీవీఎంసీ చర్చ జరుగుతోంది. స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన కొన్ని అంశాలకు సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ కింద కొంత మొత్తం వసూలు చేశారని, దానిని వాటాలు వేసుకునే క్రమంలో సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో తమపై ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం చేయడంపై సభ్యులు ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.
జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీది అత్యంత కీలక పాత్ర. రూ.50 లక్షలలోపు విలువైన అభివృద్ధి పనులతోపాటు బిల్లుల చెల్లింపునకు ఆమోదం, కొన్ని పరిపాలనా, ఉద్యోగుల సర్వీస్ పరమైన అంశాలన్నీ స్టాండింగ్ కమిటీ పరిధిలో ఉంటాయి. కమిటీలో సభ్యులుగా పది మంది కార్పొరేటర్లు ఉంటే, చైర్మన్‌గా మేయర్ వ్యవహరిస్తారు. వైసీపీ హయాంలో స్టాండింగ్ కమిటీ సమావేశం అంటే కమీషన్ల జాతర అనే అభిప్రాయం అధికారులు, కార్పొరేటర్లతోపాటు కాంట్రాక్టర్లలో ఉండేది. ఈ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మొదటి స్టాండింగ్ కమిటీ బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్ల నుంచి రెండు శాతం కమీషన్ వసూలుచేస్తే, రెండో ఏడాది ఎన్నికైన స్టాండింగ్ కమిటీ నాలుగు శాతం, మూడో ఏడాది ఎన్నికైన స్టాండింగ్ కమిటీ ఎనిమిది శాతం చొప్పున వసూలుచేశాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మొత్తాన్ని సభ్యులు పంచుకునేవారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినాసరే పట్టించుకునేవారు కాదు. తర్వాత రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో గత ఏడాది జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ సభ్యులే పది స్థానాలను దక్కించుకున్నారు. ఆ కమిటీపై పెద్దగా ఆరోపణలు రాలేదు. మూడు నెలలు కిందట ఎన్నికైన తాజా స్టాండింగ్ కమిటీపై మాత్రం ఆరోపణలు వెల్లువెత్తుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జీవీఎంసీలో ఒక కీలక నేతతో తిరుగుతున్న ప్రైవేటు వ్యక్తి స్టాండింగ్ కమిటీ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీ అజెండాలో ఏ అంశాలు పెట్టాలో ఆయనే అధికారులకు చెబుతున్నారని, తాము ఆమోదించిన అంశాల్లో బిల్లుల చెల్లింపునకు సంబంధించినవి వుంటే సంబంధిత అధికారుల ద్వారా ఆ పనులుచేసి కాంట్రాక్టర్లను పిలిచి పది శాతం కమీషన్ ఇవ్వాలని ముక్కుపిండి వసూలుచేస్తున్నారని కొందరు సభ్యులే చెబుతున్నారు. అలా వసూలుచేసిన మొత్తంలో నాలుగు శాతం కీలక నేతకు ఇవ్వాలని మినహాయించి, మిగిలిన మొత్తంలో సభ్యులతోపాటు సదరు ప్రైవేటు వ్యక్తి కూడా సమాన వాటా తీసుకుంటున్నారంటున్నారు. తమ పేరుతో వసూలుచేసే కమీషన్‌ను తమకు పూర్తిగా ఇవ్వడం లేదని, ఏదో తన జేబులో డబ్బులు ఇస్తున్నట్టు తోచినంత మొత్తాన్ని చేతిలో పెడుతున్నాడని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండు రోజుల క్రితం (బుధవారం) జరిగిన స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాల్లో కొందరు కాంట్రాక్టర్ల నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారని, అందులో ఆరు శాతం కింద సభ్యులకు రూ.14 లక్షలు కేటాయించి, 11 వాటాలు వేశారని. మిగిలిన రూ.11 లక్షలను నాలుగు శాతం కింద కీలక నేతకు ఇచ్చినట్టు చెబుతున్నారని స్టాండింగ్ కమిటీలోని ఒక సభ్యుడు ఆరోపించారు. అయితే వసూలైన మొత్తాన్ని 11 వాటాలు వేయాలని కొందరు సభ్యులు పట్టుబట్టినట్టు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఏం జరుగుతుందోననే చర్చ కార్పొరేటర్లలో చర్చ జరుగుతుండడం విశేషం.