Share News

వాణిజ్య సరళిలో మునగ సాగు

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:26 AM

మునగ ఆకులో అత్యధిక పోషక విలువలు, ఔషధ గుణాలు వుండడంతో కొంతకాలం నుంచి మునగ ఆకులు, పొడి వినియోగం పెరుగుతున్నది. పలువురు మునగ తోటలను పెంచుతూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. దీంతో డ్వాక్రా సంఘాల ద్వారా మునగ సాగు చేయించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మునగ సాగు కోసం పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో గొలుగొండ, బుచ్చెయ్యపేట మండలాలను ఎంపిక చేసింది. తొలుత ఒక్కో మండలంలో వంద ఎకరాల్లో మునగ సాగు చేపడతారు. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తారు.

వాణిజ్య సరళిలో మునగ సాగు

డ్వాక్రా సంఘాల ఆర్థిక భరోసాకు ప్రభుత్వం ప్రణాళిక

ఔషధ గుణాలు ఉండడంతో మునగ పొడికి డిమాండ్‌

పైలట్‌ ప్రాజెక్టు కింద గొలుగొండ, బుచ్చెయ్యపేట మండలాలు ఎంపిక

ఒక్కో మండలంలో వంద ఎకరాల్లో సాగు

విత్తనం సరఫరా, ఎండు ఆకు కొనుగోలుకు తమిళనాడుకు చెందిన కంపెనీతో టైఅప్‌

గొలుగొండ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మునగ ఆకులో అత్యధిక పోషక విలువలు, ఔషధ గుణాలు వుండడంతో కొంతకాలం నుంచి మునగ ఆకులు, పొడి వినియోగం పెరుగుతున్నది. పలువురు మునగ తోటలను పెంచుతూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. దీంతో డ్వాక్రా సంఘాల ద్వారా మునగ సాగు చేయించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మునగ సాగు కోసం పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో గొలుగొండ, బుచ్చెయ్యపేట మండలాలను ఎంపిక చేసింది. తొలుత ఒక్కో మండలంలో వంద ఎకరాల్లో మునగ సాగు చేపడతారు. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తారు. ఇందులో భాగంగా డ్వామా అధికారులు ఆ రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో డ్వాక్రా సభ్యులకు అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా సమీకృత సాగుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సాధారణంగా మునగ కాయల కోసం తోటలను పెంచుతుంటారు. మొక్కల మధ్య, వరుసల మధ్య 10-12 అడుగుల దూరం వుండేలా మొక్కలు నాటుతారు. కానీ ఆకుల కోసమే సాగు చేస్తుండడంతో మొక్కల మధ్య, వరుసల మధ్య రెండు అడుగుల దూరం మాత్రమే వుంటుంది. అందవల్ల ఎకరాకు 5,300 విత్తనాలు నాటుతారు. విత్తిన 90 రోజులకు మొదటి విడద ఆకు కోతకు వస్తుంది. సాగుదారులైన డ్వాక్రా మహిళలు తోటల్లో ఆకులు కోసి, ఎండబెట్టి, ప్యాకింగ్‌ చేయాలి. ఎండిన మునగ ఆకు కిలో రూ.250కి కొనుగోలు చేసేలా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. మునగ విత్తనాలను కూడా ఈ కంపెనీయే సరఫరా చేస్తుంది. విత్తనం ఖర్చుతోపాటు పొలంలో నాటడానికి, ఇతర పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో మునగ సాగు చేసే ఏటా రూ.5-7 లక్షల వరకు ఆదాయం వస్తుందని డ్వామా సిబ్బంది చెబుతున్నారు. మునగ తోటల సాగుకు ఆసక్తి ఉన్న డ్వాక్రా సంఘాలు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎం కరుణానిధి తెలిపారు.

Updated Date - Jun 06 , 2025 | 12:26 AM