కౌన్సిల్ తీర్మానానికి తిలోదకాలు!
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:18 AM
జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానాన్ని ఇంజనీరింగ్ అధికారులు కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘స్మార్ట్ సిటీ ప్రాజెక్టు’ కాలపరిమితి ముగియడంతో రద్దుకు కార్పొరేటర్ల డిమాండ్
స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు ఇకపై పనులు అప్పగించడానికి వీల్లేదని, ఉన్న ప్రాజెక్టులను, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని పాలకవర్గంం తీర్మానం
ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యేకంగా మేయర్ ఆదేశాలు
అయినా స్మార్ట్ సిటీ కింద రూ.30 కోట్లతో వర్కింగ్ ఉమెన్‌హాస్టల్ నిర్మాణానికి టెండర్లు
వివాదాస్పదమవుతున్న ఇంజనీరింగ్ అధికారులతీరు
విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానాన్ని ఇంజనీరింగ్ అధికారులు కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘స్మార్ట్ సిటీ ప్రాజెక్టు’కు గడువు ముగియడంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో రద్దు చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీలో కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసి, ఆ కార్యాలయాన్ని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలని ఈ ఏడాది జూన్ ఆరున జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కౌన్సిల్‌లోనే ఇంజనీరింగ్ అధికారులకు మేయర్ పీలా శ్రీనివాసరావు స్పష్టంగా ఆదేశాలు జారీచేశారు. అయితే జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు మాత్రం కౌన్సిల్ తీర్మానంతోపాటు మేయర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ గాజువాకలో రూ.30 కోట్ల వ్యయంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన నిర్మాణం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టేందుకు రెండు రోజులు కిందట టెండర్ పిలిచారు.
జీవీఎంసీ పరిధిలో మధురవాడ, ముడసర్లోవ, గాజువాక ప్రాంతాల్లో రూ.174 కోట్ల వ్యయంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట ఉత్తర్వులు జారీచేసింది. ఆ పనులను స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే జీవీఎంసీ పరిధిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వ్యవహారాలు చూసే గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీవీఎస్‌సీసీఎల్) కాలపరిమితి ముగియడంతో నేరుగా టెండర్లు పిలిచేందుకు అవకాశం లేకుండాపోయింది. దాంతో జీవీఎంసీ కౌన్సిల్ అనుమతి కోసం ఈ ఏడాది జూన్ ఆరున జరిగిన సమావేశం అజెండాలో వర్కింగ్ హాస్టళ్ల నిర్మాణం ప్రతిపాదనను పొందుపరిచారు. ఈ అంశంపై కౌన్సిల్‌లో చర్చ జరిగినప్పుడు స్మార్ట్ సిటీ కింద నగరంలో రూ.వేలకోట్ల విలువైన పనులు జరిగాయని, దీనిని పర్యవేక్షించే అధికారం జీవీఎంసీకి లేకుండా ఒక ప్రైవేటు ఉద్యోగికి అప్పగించడంతో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవీఎంసీలో ఎంతో అనుభవం కలిగిన నిపుణులైన ఇంజనీర్లు ఉండగా వారిని కాదని, ఒక ప్రైవేటు ఉద్యోగికి పర్యవేక్షణ అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గడువు ముగియడంతో దేశవ్యాప్తంగా నగరాల్లో రద్దు చేశారని, విశాఖలో ప్రైవేటు ఉద్యోగి రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని ఇంకా కొనసాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జీవీఎంసీలో కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని కింద చేపట్టిన పనులతోపాటు కార్యాలయాన్ని జీవీఎంసీకి అప్పగించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. దీంతో మేయర్ పీలా శ్రీనివాసరావు ఇకపై విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పనులు అప్పగించడానికి వీల్లేదని, ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులను, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్మానం చేస్తూ, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ విషయాన్ని జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోకుండా గాజువాకలో ఏపీఐఐసీ కేటాయించిన స్థలంలో రూ.30 కోట్లతో భవనాలు నిర్మించేందుకు రెండు రోజుల కిందట టెండర్లు పిలవడం ఆశ్చర్యానికి గురిచేసినట్టయింది. నిబంధనల ప్రకారం కౌన్సిల్ ఆమోదం లేకుండా టెండర్‌లు పిలవకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు అత్యుత్సాహం చూపించారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.