చేతులు మారిన కాలనీ ఇళ్లు
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:16 AM
నగరంలోని అగనంపూడి సమీపాన సుమారు పుష్కరకాలం కిందట నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో కొన్ని ఇళ్లు చేతులు మారిపోయాయి.
అగనంపూడి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో 298 ఇళ్లు అమ్మకం
494 ఇళ్లల్లో గృహ ప్రవేశాలే చేయలేదు
రౌడీమూకల ఆక్రమణలో మరికొన్ని ఇళ్లు...
1709 ఇళ్లకు తాళాలు
సర్వేలో బహిర్గతం
విశాఖపట్నం/కూర్మన్నపాలెం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని అగనంపూడి సమీపాన సుమారు పుష్కరకాలం కిందట నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో కొన్ని ఇళ్లు చేతులు మారిపోయాయి. మరికొన్ని ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇంకొన్ని ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నాయి. కాలనీలో 298 మంది లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను ఇతరులకు విక్రయించేశారు. మరో 494 మంది ఇప్పటివరకూ తమ కేటాయించిన ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయలేదు. ఇళ్ల కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతోపాటు, కొందరు రౌడీమూకలు ఇళ్లను ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించారనే వస్తున్న ఫిర్యాదులపై విచారణ చేయాలని కలెక్టర్‌కు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నాలుగు నెలల క్రితం లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా కాలనీలో ఇళ్ల లబ్ధిదారులపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ ఆదేశించారు. రెవెన్యూ, జీవీఎంసీ యూసీడీ, హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన అధికారులు, సిబ్బందితో 11 బృందాలను నియమించారు. ఆ బృందాలు సర్వే చేసి నివేదికను సిద్ధం చేశాయి.
ఉమ్మడి ఏపీలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అగనంపూడి శివారున కొండకు ఆనుకుని 113 బ్లాక్‌లలో 3,616 ఇళ్లు నిర్మించారు. ఇంటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1,96,500 మంజూరుచేశాయి. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు దశల వారీగా రూ.44 వేలు చెల్లించారు. రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు కల్పించారు. పాఠశాల, సామాజిక భవనాలు నిర్మించారు. అయితే అప్పట్లో గాజువాకకు దూరంగా ఉండడంతో చాలాకాలం లబ్ధిదారులు కాలనీకి వెళ్లలేదు. కొద్దిమంది మాత్రమే తొలుత అక్కడ నివాసం ఏర్పాటుచేసుకోగా, తరువాత నెమ్మదిగా మరికొందరు వెళ్లారు. ఇంకా కొందరు రాకపోవడంతో దానిని అవకాశంగా తీసుకుని రౌడీమూకలు ఖాళీగా ఉన్న ఇళ్లను తప్పుడు పత్రాలు సృష్టించి తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. కాలనీలో లబ్ధిదారులు ఉంటున్నారా? లేదా అనే దానిపై గతంలో హౌసింగ్ అధికారులు ఒకసారి సర్వే చేశారు. ఇళ్లలో నివాసాలు లేనివారిని గుర్తించి నోటీసులు ఇచ్చి కేటాయింపులు రద్దు చేశారు. కొందరు అప్పటికప్పుడు అధికారులను కలిసి విన్నవించుకోగా సమాచారం లేని మరికొందరు పట్టించుకోలేదు. ఇటువంటి ఇళ్లను ఇతరులకు కేటాయించినపుడు హౌసింగ్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందనే వాదన వినిపించింది.
కాగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అగనంపూడి కాలనీలో ఖాళీగా ఉన్న ఇళ్లను తమకు కేటాయించాలని గాజువాకు చెందిన పేదలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీలో తాజా పరిస్థితిపై విచారణ చేయాలని కోరిన వెంటనే కలెక్టర్ పూర్తిస్థాయిలో ప్రతి ఇంటికీ బృందాన్ని పంపి వాస్తవాలు సేకరించారు. మొత్తం 3,616 ఇళ్లలో 298 మంది లబ్ధిదారులు తమ ఇళ్లను ఇతరులకు విక్రయించేసి వెళ్లిపోగా 2012లో ఇళ్లు కేటాయించినా ఇంత వరకు గృహ ప్రవేశాలు చేయనివారు 494 మంది ఉన్నట్టు విచారణలో తేలింది. కాలనీలో 943 మంది నివాసం ఉండగా, 168 ఇళ్లలో ఇతరులు అద్దెకు ఉంటున్నారు. మరో నాలుగు ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు చనిపోయినట్టు గుర్తించారు. విచారణ సమయంలో 1,709 ఇళ్లకు తాళాలు వేసినట్టు గుర్తించారు. విచారణ బృందాలు వస్తున్న విషయం తెలుసుకున్న కొందరు బినామీలు, అనధికారికంగా ఆక్రమించిన వ్యక్తులు అప్రమత్తమై ఇళ్లకు తాళాలు వేసినట్టు అనుమానిస్తున్నారు. రౌడీమూకలు ముఠాగా ఏర్పడి పదుల సంఖ్యలో అనధికారింగా ఆక్రమించడం లేదా అద్దెకు ఇవ్వడం చేశారని కాలనీలో పలువురు చెబుతున్నారు. హౌసింగ్ అధికారులు విచారణ నివేదికను త్వరలో కలెక్టర్‌కు అందజేయనున్నారు. దీని ప్రకారం అనర్హులను ఏరివేసి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.