Share News

కాంట్రాక్టర్‌తో కుమ్మక్కు

ABN , Publish Date - Dec 09 , 2025 | 01:51 AM

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ మెకానికల్‌ విభాగంలో అవకతవకలు రోజుకొకటి బయటపడుతున్నాయి.

కాంట్రాక్టర్‌తో కుమ్మక్కు

  • భీమిలి సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహణ నామినేషన్‌ పద్ధతిపై కేటాయింపు

  • టెండర్‌ పిలవకుండా అస్మదీయ కాంట్రాక్టర్‌కు అప్పగింత

  • మెకానికల్‌ అధికారుల తీరుపై స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఆగ్రహం

  • ఆరోపణలు రావడంతో ఇప్పుడు టెండర్లు పిలిచేందుకు ప్రతిపాదన

  • ఏడాదిపాటు నామినేషన్‌కు ఎలా ఇచ్చారని నిలదీసిన మేయర్‌

  • సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ మెకానికల్‌ విభాగంలో అవకతవకలు రోజుకొకటి బయటపడుతున్నాయి. రూ.ఐదు లక్షలు దాటిన పనులకు టెండరు పిలిచి ఎంపికైన కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సిన అధికారులు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.24 లక్షల విలువైన భీమిలి సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహణను అస్మదీయుడైన కాంట్రాక్టర్‌కు నామినేషన్‌పై ఏడాదిపాటు కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నగరంలో వ్యర్థాల సేకరణ, డంపింగ్‌ యార్డుకు చెత్త తరలింపు ప్రక్రియను స్మార్ట్‌గా నిర్వహించడం ద్వారా పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ఇబ్బందిలేకుండా చేసే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా క్లోజ్డ్‌ కాంపాక్టర్‌ సిస్టమ్‌ (సీసీఎస్‌) ప్రాజెక్టులకు రూపకల్పన చేశాయి. మునిసిపల్‌ కార్పొరేషన్లు, ప్రధాన మునిసిపాలిటీల్లో ఈ ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చాయి. ఇందులో భాగంగా జీవీఎంసీ పరిధిలో ముడసర్లోవ, టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లిలో వీటిని ఏర్పాటుచేశారు. నగరంలో ఇళ్ల నుంచి చెత్తను క్లాప్‌ వాహనాలు సేకరించి సమీపంలోని గార్బేజీ ట్రాన్స్‌ఫర్స్‌ స్టేషన్‌ (జీటీఎస్‌)లకు చేరవేస్తాయి. అక్కడకు చేరిన చెత్తను సీసీఎస్‌ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక యంత్రాలతోకంప్రెస్‌ చేసి కేక్‌ మాదిరిగా మార్చి ట్యాంకర్‌ మాదిరిగా ఉండే హుక్‌లోడర్‌ (కంటెయినర్‌)లోకి పంపిస్తుంది. అన్నివైపులా మూసివుండే హుక్‌లోడర్‌లో చెత్తను నేరుగా కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. దీనివల్ల చెత్త నుంచి బయటకు దుర్వాసన రావడం, గాలికి చెత్త ఎగిరి జనావాసాలు, ప్రజలపై పడే పరిస్థితి వుండదు పర్యావరణానికి కూడా ఎలాంటి సమస్య ఉండదు.

టెండర్‌కే టెండర్‌

ఇదిలావుండగా సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణను అర్హులైన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఏడాదికి ఒకసారి టెండర్లు పిలుస్తున్నారు. అధికారులు నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు కలిగిన కాంట్రాక్టర్లలో ఎవరు తక్కువకు కోట్‌ చేస్తే వారికి ప్రాజెక్టు నిర్వహణ అప్పగించాలి. అయితే భీమిలి సీసీఎస్‌ ప్రాజెక్టు విషయంలో అధికారులు దీనికి విరుద్ధంగా వ్యవహరించడం వివాదానికి తావిస్తోంది. నగరంలో నాలుగు జోన్లలో అమలవుతున్న సీసీఎస్‌ ప్రాజెక్టును భీమిలి జోన్‌లో కూడా అందుబాటులోకి తేవాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. దీనికోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో భీమిలి జోన్‌లోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ (జీటీఎస్‌)లో సీసీఎస్‌ ప్రాజెక్టును ఏర్పాటుచేసిన సంస్థ గత ఏడాది అక్టోబరు 15 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడంతో 15 రోజులు ట్రయల్‌రన్‌ నిర్వహించి నవంబరు 1న జీవీఎంసీకి అప్పగించింది. అప్పటినుంచి మెకానికల్‌ విభాగం అధికారులు సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు టెండర్లు పిలిచి అర్హులను ఎంపికచేయాలి. కానీ గత ఏడాది నవంబరు ఒకటి నుంచి ఇప్పటివరకు సీసీఎస్‌ ప్రాజెక్టుకు టెండరు పిలవకుండా అస్మదీయులైన సంస్థకు నామినేషన్‌పై అప్పగిస్తూ వచ్చారు. సుమారు రూ.24 లక్షల విలువైన పనిని ఏడాదిపాటు నామినేషన్‌ పద్ధతిలో కొనసాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మెకానికల్‌ విభాగం అధికారులు అప్రమత్తమై ఆగమేఘాల మీద భీమిలి సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహణకు టెండరు తయారుచేసి, స్టాండింగ్‌ కమిటీ ఆమోదానికి ప్రతిపాదించారు.

మేయర్‌ ప్రశ్నల వర్షం

దీనిపై చర్చ సందర్భంగా మేయర్‌ పీలా శ్రీనివాసరావుతో పాటు కొందరు సభ్యులు ఏడాదిగా సీసీఎస్‌ ప్రాజెక్టును ఎవరు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఎస్‌ఈ గోవిందరావు సమాధానం ఇస్తూ ఇకపై నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నామని, గతంలో జరిగిన దానికి కాదని సమాధానం ఇవ్వడంతో మేయర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడాదికి సుమారు రూ.24 లక్షలు ఖర్చవుతోందని ప్రతిపాదన పెట్టగా...ఏడాదిగా ఎవరు నిర్వహించారు? టెండరు పిలిచారా? అని తిరిగి ప్రశ్నించేసరికి స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఆ ప్రాజెక్టును స్వయంగా పరిశీలిస్తామని, ఏడాదిలో ఎంత బిల్లులు చెల్లించారో వివరాలు అందజేయాలని స్పష్టంచేశారు. సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహణకు టెండరు పిలవకుండా నామినేషన్‌పై అప్పగించడంలో మతలబు ఏమిటనే దానిపై స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి హాజరైన ఇతర అధికారులతోపాటు సభ్యులు సైతం చర్చించుకుంటున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 01:51 AM