Share News

కాంటాక్టర్లతో కుమ్మక్కు!

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:49 AM

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

కాంటాక్టర్లతో కుమ్మక్కు!

  • అస్మదీయుల కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు

  • టెండర్‌ నోటిఫికేషన్‌ జారీలో నిబంధనలకు తూట్లు

  • ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన ఎలక్ర్టికల్‌ వర్కు టెండర్‌ మాయం

  • ఒక బడా కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు నాటకం

  • బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామంటున్న చీఫ్‌ ఇంజనీర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమకు అస్మదీయులైన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన టెండర్లను కూడా మాయం చేస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలో ఏదైనా పని చేయాలంటే ఇంజనీరింగ్‌ అధికారులు ముందుగా సంబంధిత ఏఈ ద్వారా దానికి సంబంధించిన డిజైన్‌, డ్రాయింగ్‌తోపాటు ఎంత ఖర్చవుతుందని అంచనాలను తయారుచేయిస్తారు. తర్వాత డీఈ, ఈఈ, ఎస్‌ఈలు వాటిని పరిశీలించి అవసరమైతే చీఫ్‌ ఇంజనీర్‌ ద్వారా కమిషనర్‌కు పంపిస్తారు. కమిషనర్‌ స్థాయిలో అంచనాలను పరిశీలించి ఆమోదం తెలిపితే డ్రాయింగ్‌ బ్రాంచ్‌లో ఆ పనికి ఇంజనీరింగ్‌ అధికారులు వేసిన అంచనాలు ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లకు అనుగుణంగా ఉన్నాయో? లేదో పరిశీలించి టెండర్‌ పిలిచేందుకు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. కాంట్రాక్టర్లు తమ అర్హత, ఆసక్తిని బట్టి ఆయా పనులకు బిడ్‌లను వేస్తారు. ఎవరు ఎక్కువ లెస్‌కు వేస్తే వారితో వర్క్‌ అగ్రిమెంట్‌ చేసుకుని ఆర్డర్‌ అందజేస్తారు. ఒకసారి టెండర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే తర్వాత తొలగించడానికి అవకాశం ఉండదు. కానీ తాజాగా ఎలక్ర్టికల్‌ విభాగంలో ఒక పనికి సంబంధించిన టెండర్‌ వెబ్‌సైట్‌ నుంచి మాయం కావడం చర్చనీయాంశంగా మారింది.

జీవీఎంసీ 31వ వార్డు పరిధిలో ఇన్‌కమ్‌ట్యాక్స్‌ క్వార్టర్స్‌ నుంచి లీలామహల్‌ జంక్షన్‌ మీదుగా డీమార్ట్‌ జంక్షన్‌ వరకూ వీధి దీపాలకు సంబంధించిన స్తంభాల ఏర్పాటుకోసం రూ.16.36 లక్షలతో (టెండర్‌ ఐడీ 834773) జోన్‌-3 ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఈనెల ఒకటిన ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్‌ పిలిచారు. బిడ్‌ దాఖలుకు ఈనెల 13 మధ్యాహ్నం 3.30 గంటల వరకు గడువు ఇచ్చారు. అయితే ఆగస్టు 12 వరకు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో ఆ టెండర్‌ కనిపించింది. 13న ఆఖరు తేదీ కావడంతో బిడ్‌ వేసేందుకు కాంట్రాక్టర్లు వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వగా ఆ టెండర్‌ కనిపించలేదు. అప్పటికే ఆ టెండర్‌ వివరాలను ప్రింట్‌ తీసుకున్న కాంట్రాక్టర్లు ఐడీ నంబర్‌ ఆధారంగా వెతికినా కనిపించకపోవడంతో తమకు తెలిసిన వారిని సంప్రతించారు. ఆపనిలో బాగా డబ్బులు మిగిలేందుకు అవకాశం ఉండడంతో ప్రస్తుతం పిలిచిన టెండర్‌లో కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలని షరతు విధిస్తూ తమకు అనుకూలంగా దానిని రీకాల్‌ చేయాలని ఒక కాంట్రాక్టర్‌ సంబంధిత అధికారిని కోరడంతో అలా చేసినట్టు సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయని, ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే అస్మదీయ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి బండారం బయటపడుతుందని చెబుతున్నారు. ఈ విషయం చీఫ్‌ ఇంజనీర్‌ పల్లంరాజు వద్ద ప్రస్తావించగా, ఒకసారి ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో పెట్టిన టెండర్‌ను తొలగించడానికి అవకాశం లేద ని స్పష్టంచేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన వారిలో భయం వస్తుందన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:49 AM