స్వచ్ఛ సర్వేక్షణ్‌పై కలెక్టర్ సమీక్ష
ABN , Publish Date - Mar 14 , 2025 | 01:02 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, పీ4, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వంటి కార్యక్రమాలను జోనల్, వార్డు స్థాయి ప్రత్యేక అధికారులతోపాటు జోనల్ కమిషనర్లు కూడా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేంధిర్ ప్రసాద్ ఆదేశించారు.

కార్యక్రమాలను జోనల్ కమిషనర్లు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశం
ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర
పీ4ను 18లోగా పూర్తి చేయాలి
విశాఖపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, పీ4, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వంటి కార్యక్రమాలను జోనల్, వార్డు స్థాయి ప్రత్యేక అధికారులతోపాటు జోనల్ కమిషనర్లు కూడా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేంధిర్ ప్రసాద్ ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సర్వే నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ ప్రమాణాలకు అనుగుణంగా పరిస్థితి ఉండేలా చూసుకోవాలన్నారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను వార్డు స్థాయి ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పీ4 సర్వేను 18వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణ పక్కాగా జరగాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ పి.శివప్రసాదరాజు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, ఆర్.సోమన్నారాయణ, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్‌వీ నరేష్, సీసీపీ ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.
70 ఏళ్లు దాటితే ఆయుష్మాన్ వయో వందన కార్డులు
విశాఖపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ వయో వందన కార్డులు పంపిణీ చేయనున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జె.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఈ లబ్ధి పొందవచ్చునని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్), మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ఈసీహెచ్‌ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) వంటి వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సీనియర్ సిటిజన్లు వారి ప్రస్తుత పథకం, లేకపోతే ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనను ఎంచుకోవచ్చునని వివరించారు. ప్రైవేటు ఆరోగ్య బీమా కవరేజీ పరిధిలోకి వచ్చే వ్యక్తులు, ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం సభ్యులు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులన్నారు. జిల్లాలో అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ వయో వందన కార్డులు పొందేందుకు సమీపంలోని ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలన్నారు. స్వీయ రిజిస్ర్టేషన్‌కు ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. మరిన్ని వివరాలకు 14555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చునని లేదా 1800110770 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం
పెందుర్తి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):
అక్రమంగా రవాణా అవుతున్న 900 (23 బస్తాలు) కిలోల రేషన్ బియ్యాన్ని మండలంలోని కాపుజగ్గరాజుపేట వద్ద సీఐ కేవీ సతీశ్‌కుమార్ ఆఽధ్వర్యంలో సిబ్బంది గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మల్కాపురం దుర్గానగర్‌కు చెందిన పూసర్ల అచ్చిబాబు (49)ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. పట్టుబడ్డ బియ్యాన్ని ఎంఎల్‌సీ పాయింట్‌కు తరలించనున్నామన్నారు. తెలుపు రంగు కార్డుదారులకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని దళారులు కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తుంటారన్నారు. మిల్లులో పాలిష్ పట్టి సన్న బియ్యంగా మళ్లీ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని సీఐ తెలిపారు.