వన్ ధన్ వికాస కేంద్రాలపై కలెక్టర్ అసంతృప్తి
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:00 PM
గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస కేంద్రాల(వీడీవీకే) నిర్వహణకు లక్షలు వెచ్చించి ప్రణాళికలు లేకుండా కొనసాగించడం సాధ్యమేనా? అని అధికారులపై కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు.
ప్రణాళికలు లేకుండా కేంద్రాల నిర్వహణ సాధ్యమేనా? అని అసహనం
మహిళలకు శిక్షణ ఇవ్వకుండా కేంద్రాన్ని ఎలా నడుపుతున్నారని నిలదీత
డుంబ్రిగుడ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస కేంద్రాల(వీడీవీకే) నిర్వహణకు లక్షలు వెచ్చించి ప్రణాళికలు లేకుండా కొనసాగించడం సాధ్యమేనా? అని అధికారులపై కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. మండలంలోని అరకు కేంద్రంగా కొర్రాయిలో చిరు ధాన్యాలతో బిస్కెట్లు తయారు చేసే వన్ ధన్ వికాస కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. బిస్కెట్ల తయారీకి వినియోగించే యంత్రాల పని తీరుతో పాటు తయారీ విధానం, మార్కెటింగ్‌కు అనుగుణంగా జరుగుతున్న ఉత్పత్తిపై అడిగి తెలుసుకున్నారు. ఒక్కో కేంద్రం నిర్వహణకు లక్షలు వెచ్చించినప్పటికీ మార్కెటింగ్‌కు డిమాండ్ పెరిగేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. లక్షలు వెచ్చించిన కేంద్రాలు మూతబడడానికేనా? అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రణాళికలు లేకుండా కేంద్రాలు నడపడం సాధ్యపడదన్నారు. దీనికి తోడు తూతూ మంత్రంగా శిక్షణ ఇప్పించి వికాస కేంద్రాలను నడపడం సాధ్యంకాదన్నారు. ఇప్పటికైనా మహిళా సంఘాల సభ్యులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కల్పించేలా తోడ్పాటు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. శిక్షణ ఇప్పించి అందులో నైపుణ్యం కలిగిన మహిళలకు కేంద్రాల నిర్వహణ అప్పగిస్తే మార్కెటింగ్ సాధ్యపడుతుందన్నారు. సాగర పంచాయతీలోని కుసమగుడలో గల అడ్డాకులు, కొండచీపుర్ల వన్ ధన్ వికాస కేంద్రాన్ని సందర్శించి యంత్రాలను పరిశీలించారు. అడ్డాకుల ప్లేట్లు, కొండచీపుర్లతో వచ్చే ఆదాయాన్ని గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. నాలుగేళ్ల క్రితం యంత్రాలను సమకూర్చి ఆపై వదిలేశారని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గిరిజన మహిళలకు ఆదాయం కల్పించే మార్గం ఇదేనా? అని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు శిక్షణ ఇవ్వకుండా కేంద్రం ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ మురళి, సర్పంచ్ శారద, తౌడమ్మ, ఎంపీటీసీ సభ్యుడు దేవదాసు, అధికారులు పాల్గొన్నారు.