నేడు రాజయ్యపేటకు కలెక్టర్
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:42 AM
కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం నక్కపల్లి మండలం రాజయ్యపేట వెళ్లనున్నారు. బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుమారు ఆరు వారాలుగా మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
బల్క్‌డ్రగ్ పార్కుపై మత్స్యకారులతో సమావేశం కానున్న విజయకృష్ణన్
అనకాపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం నక్కపల్లి మండలం రాజయ్యపేట వెళ్లనున్నారు. బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుమారు ఆరు వారాలుగా మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన మత్స్యకారులు నక్కపల్లి వరకు ర్యాలీగా వచ్చి జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో సుమారు నాలుగు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. డివిజన్‌స్థాయి అధికారులు నచ్చజెప్పినా.. మత్స్యకారులు ఆందోళన విరమించలేదు. దీంతో కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. త్వరలో రాజయ్యపేటకు వచ్చి, అన్ని విషయాలపై మత్స్యకారులతో మాట్లాడతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. వాస్తవంగా కలెక్టర్ గత వారమే రాజయ్యపేట వెళ్లాల్సి వుంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆమె పర్యటన వాయిదా పడింది. శుక్రవారంం కలెక్టర్‌తోపాటు ఎస్పీ కూడా రాజయ్యపేట వెళుతున్నారు. మత్స్యకారుల సమస్యలపై వారితో శాంతియుతంగా చర్యలు జరిపి, వారి అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతారని తెలిసింది.
నేతలను గృహనిర్బంధం చేయొద్దు
అధికారులకు మత్స్యకారుల వినతి
నక్కపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం రాజయ్యపేట పర్యటన సందర్భంగా నేతలెవరినీ గృహనిర్బంధం చేయవద్దని మత్స్యకార నేతలు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. తహశీల్దార్ నరసింహమూర్తి, సీఐ మురళీ గురువారం రాజయ్యపేట వెళ్లి మత్స్యకారులతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం పది గంటలకు కలెక్టర్ ఇక్కడకు వస్తారని చెప్పారు. అయితే తమ పోరాటానికి ఆది నుంచీ మద్దతు ఇస్తున్న సీపీఎం నేత అప్పలరాజు, వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ, శీరం నరసింహమూర్తి, గుర్రాజుపేటకు చెందిన దాట్ల ఉమాదేవి, సీసీఐ నేత దొరబాబులను గృహనిర్బంధం చేయకూడదని, కలెక్టర్ సమక్షంలో వారు కూడా మాట్లాడేందుకు అనుమతులివ్వాలని మత్స్యకారులు కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తహశీల్దార్ చెప్పారు. కాగా కలెక్టర్ పర్యటన నేపథ్యంలో నక్కపల్లి హైవే జంక్షన్ నుంచి రాజయ్యపేట వరకు పోలీస్ బలగాలను మోహరించనున్నట్టు తెలిసింది.