హౌసింగ్ అధికారులపై కలెక్టర్ సీరియస్
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:20 AM
ప్రధానమంత్రి జన్‌మన్ ఇళ్ల గ్రౌండింగ్‌లో ఎందుకు జాప్యం చేస్తున్నారని హౌసింగ్ అధికారులపై కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తిగా ఉందని, ఇకపై నిరక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
- పీఎం జన్‌మన్ ఇళ్ల గ్రౌండింగ్‌లో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
పాడేరు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి జన్‌మన్ ఇళ్ల గ్రౌండింగ్‌లో ఎందుకు జాప్యం చేస్తున్నారని హౌసింగ్ అధికారులపై కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తిగా ఉందని, ఇకపై నిరక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారుల పాత ఇంటిని తొలగించకుండా కొత్త ఇంటి నిర్మాణానికి స్థలం కేటాయించాలని సూచించారు. పాత ఇంట్లో హోం స్టేలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. నిర్మాణం పూర్తయిన 11,470 గృహాలకు ఈ నెల 12న గృహ ప్రవేశాలు నిర్వహించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను గృహా ప్రవేశాలకు ఆహ్వానించాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్‌లో మంజూరు చేసిన పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. చిన్నతరహా పరిశ్రమల కార్యక్రమాల పర్యవేక్షణకు ఇండస్ర్టియల్ అసిస్టెంట్ ప్రమోషన్ అధికారిగా సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి నియమిస్తామని చెప్పారు. జిల్లాలో పాడేరు డివిజన్‌లో 60, చింతూరులో 20, రంపచోడవరంలో 40 చొప్పున మొత్తం 120 చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. జిల్లాలో ఇసుక రీచ్‌లపై అడిగి తెలుసుకుని, జిల్లాలో 40 వేల గృహ నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటికి ఇసుక ఎక్కడ నుంచి తరలిస్తున్నారని ఆరా తీశారు. మండలాల వారీగా ఇసుక అవసరాలపై నివేదిక సమర్పిచాలని సూచించారు. దివ్యాంగులకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించి 15 శాతం పురోగతి సాధించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించాలని, గ్రామాల్లో విద్యుత్ సంబంధిత సమస్యలపై ప్రజల నుంచి ప్రతి స్పందన సేకరించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పీవోలు ఎంజే అభిషేక్‌గౌడ, కట్టా సింహాచలం, గృహ నిర్మాణ సంస్థ పీడీ బి.బాబు, డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్.కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి జి.రవిశంకర్, జిల్లా సహకార అధికారి ఎంవీ రామకృష్ణంరాజు, మైనింగ్ ఏడీ ఎం.ఆనంద్, సీపీవో ఎస్‌ఎస్‌ఆర్కే పట్నాయక్, జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఎంపీడీవోలు, మైనింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
5 వేల మంది గిరిజనులతో గంగవరంలో యోగా
యోగాంధ్రలో భాగంగా రంపచోడవరం డివిజన్ పరిధిలోని గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5 వేల మంది గిరిజనులతో ఈ నెల 4న యోగా సాధన నిర్వహిస్తామని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. యోగాంధ్రపై సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జూన్ 3న అరకులోయలో, 11న మారేడుమిల్లిలో, 17న చాపరాయి వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.
2 లక్షల మొక్కలు నాటాలి
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వనం- మనం’ పేరిట జూన్ 5న జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మొక్కలు నాటాలని అధికారులకు కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ సూచించారు. ముఖ్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో లక్ష మొక్కలు, అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 50 వేల మొక్కలు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు, డ్వామా, ఇతర శాఖలంతా మరో 50 వేల మొక్కలు నాటాలన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటి నుంచే చేపట్టాలన్నారు. అలాగే ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థలను భాఽగస్వాములను చేయాలని, ప్రజల్లో పర్యావరణంపై మరింత అవగాహన పెంచేందుకు కృషి చేయాలన్నారు. .