ఉక్కు సీఎండీని కలిసిన కలెక్టర్
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:28 AM
స్టీల్ ప్లాంటు సమస్యలపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దృష్టిసారించారు. బుధవారం ఉక్కు సీఎండీ ఏకే సక్సేనాను కలిసి మూడు అంశాలపై చర్చించారు.
నిర్వాసిత కార్మికుల తొలగింపు సహా
మూడు అంశాలపై చర్చ
విశాఖపట్నం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు సమస్యలపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దృష్టిసారించారు. బుధవారం ఉక్కు సీఎండీ ఏకే సక్సేనాను కలిసి మూడు అంశాలపై చర్చించారు. ఇటీవల అక్రమంగా తొలగించిన కాంట్రాక్టు కార్మికుల్లో నిర్వాసితులు (ఆర్.కార్డుదారులు) ఉన్నారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. దానికి సీఎండీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. మే నెలలో వారంతా సమ్మెలో పాల్గొన్నారని, కాంట్రాక్టర్లు విధుల్లోకి రమ్మని పిలిచినా రాలేదని, అందువల్ల వారిని తిరిగి తీసుకోవాలంటే ఆలోచించాల్సి వస్తోందని చెప్పినట్టు సమాచారం. అలాగే స్టీల్ ప్లాంటు ఆర్థిక సాయంతో నడుస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని తిరిగి తెరవాలని, వీలు కాకపోతే అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వీఆర్‌ఎస్ ద్వారా సెటిల్‌మెంట్ చేయాలని కలెక్టర్ కోరినట్టు సమాచారం. విద్యాలయాన్ని నడిపే ఉద్దేశం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టర్ ప్రతిపాదించినట్టు తెలిసింది. కాగా, స్టీల్‌ప్లాంటులో 3.5 ఎకరాల భూమిని జీవీఎంసీ 33 ఏళ్లకు లీజుకు తీసుకొని వాటర్ ట్యాంకు నిర్మించింది. ఏలేరు కాలువ ద్వారా వచ్చే గోదావరి నీటిని అక్కడికి పంపింగ్ చేసి గాజువాక ప్రజలకు అందిస్తోంది. తాజాగా ఆ పక్కనే మరో వాటర్ ట్యాంకు కూడా నిర్మిస్తోంది. లీజు కాలం ముగియడంతో దానిని పునరుద్ధరించాలని కలెక్టర్ కోరినట్టు సమాచారం. ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంటు భూములకు సంబంధించిన ఎటువంటి పొడిగింపులు ఇవ్వకుండా వాటిని వెనక్కి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ముఖ్మమంత్రి ఆదేశాల ప్రకారం కలెక్టర్ స్వయంగా వెళ్లి కలిసి మాట్లాడారని ఉక్కు ఉద్యోగ వర్గాలు తెలిపాయి.