పారిశుధ్య లోపంపై కలెక్టర్ కన్నెర్ర
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:17 AM
గ్రామాల్లో పారిశుధ్య లోపంపై కలెక్టర్ విజయకృష్ణన్ తీవ్ర అసహనం చెందారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. మాడుగుల మండలం ముకుందపురంలో ఐదు రోజుల్లో పారిశుధ్యం మెరుగుపడకపోతే సస్పెండ్ చేస్తానని పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు.
ముకుందపురం, వడ్డాది గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు
డ్రైనేజీ కాలువలు, రోడ్లపై చెత్త పేరుకుపోవడంపై ఆగ్రహం
పరిస్థితిని చక్కదిద్దకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరిక
మాడుగుల, బుచ్చెయ్యపేట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్య లోపంపై కలెక్టర్ విజయకృష్ణన్ తీవ్ర అసహనం చెందారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. మాడుగుల మండలం ముకుందపురంలో ఐదు రోజుల్లో పారిశుధ్యం మెరుగుపడకపోతే సస్పెండ్ చేస్తానని పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాదిలో డ్రైనేజీ కాలువలు, రోడ్డు పక్కన చెత్త పేరుకుపోవడం, తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయకపోవడంపై ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారుపై కలెక్టర్ మండిపడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం ఉదయం మాడుగుల మండలం ముకుందపురం గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మెయిన్‌రోడ్డు నుంచి గ్రామ సచివాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మురుగును చూసిన ఆమె.. ఈవోపీఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడ చెత్త నిర్వహణ అధ్వానంగా వుండడంతో అసహనం చెందాఆరు. ఐదు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సస్పెండ్ చేస్తానని పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. అనంతరం మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతీ అఽదికారులు పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ రమాదేవిని ఆదేశించారు. ప్రజలు.. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఏఎన్‌ఎం అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు.
వడ్డాదిలో..
కలెక్టర్ విజయకృష్ణన్ ముకుందపురం పర్యటన తరువాత బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది గ్రామాన్ని సందర్శించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రైనేజీ కాలువలు, రోడ్లపై చెత్త పేరుకుపోవడాన్ని గమనించిన ఆమె సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద కేంద్రం నిర్వహణ, ఆదాయానికి సంబంధించి వివరాలు అడగ్గా.. సిబ్బంది తెల్ల మొహం వేయడంతో మండిపడ్డారు. మండల పర్యటనకు వస్తున్నట్టు ముందుగానే సమాచారం ఇచ్చానని, అయినప్పటికీ రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సిబ్బంది తాను అడిగిన సమాచారం ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్వహణ బాగాలేదన్నారు. వచ్చే మంగళవారం మరోసారి ఇక్కడకు వస్తానని, పనితీరు మెరుగు పరచుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా వడ్డాదిలో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యలోపం వంటి సమస్యలను గ్రామస్థులు, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో సేకరించిన చెత్తను పెద్దేరు నది పక్కన పడేస్తున్నారని, ఇది కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నదని చెప్పారు. పశువైద్యశాలకు డాక్టర్‌ను నియమించాలని కోరారు. గ్రామంలో సర్వే నిర్వహించి ప్రజాసమస్యలపై నివేదిక ఇవ్వాలని ఎంపీడీవో బానోజీరావు, ఈవోపీఆర్‌డీ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరావులను కలెక్టర్ ఆదేశించారు. ఆమె వెంట జడ్పీ సీఈవో నారాయణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి ఇ.సందీప్, డీపీఆర్‌సీ జిల్లా కోఆర్డినేటర్ నాగలక్ష్మి, తహసీల్దార్లు కె.రమాదేవి, ఎం.లక్ష్మి, ఎంపీడీవోలు భానోజీరావు, కొంకి అప్పారావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు వున్నారు.