Share News

కనకమ్మ ఆలయంలో కలెక్టర్‌ తనిఖీలు

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:56 AM

వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయాన్ని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కనకమ్మ ఆలయంలో కలెక్టర్‌ తనిఖీలు

పుస్తకాల్లో లెక్కలకు, స్టాక్‌ రూమ్‌లో ఉన్న సరకులకు వ్యత్యాసం ఉన్నట్టు గుర్తింపు

ఇంకోసారి తేడాలు వస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

అన్నదానంలో నాణ్యత మెరుగుపడాలని హితవు

విశాఖపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయాన్ని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల అన్నదానం నాణ్యతపై ఆరోపణలు రావడం, రశీదుల పుస్తకం గల్లంతు కావడం, వెండి ఆభరణాల లెక్కలు పుస్తకాల్లో నమోదు చేయకపోవడం వంటి అంశాలతో ఈ ఆలయం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో కలెక్టర్‌ తనిఖీ చేపట్టారు. అయితే ఆ సమయంలో ఈఓ శోభారాణి లేరు. ఆరా తీస్తే సెలవుపై వెళ్లారని సిబ్బంది సమాధానం ఇచ్చారు. క్యూలైన్లు, అన్న ప్రసాదం, సరకులు నిల్వ చేసే గది అన్నింటినీ కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నదానం, ప్రసాదాల్లో ఉపయోగించాల్సిన వస్తువులను కొందరు సిబ్బంది బయటకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉండడంతో వాటిపై కూడా ఆయన దృష్టిపెట్టారు. స్టాక్‌ రూమ్‌లో ఉన్న సరకులు, వాటి రిజిస్టర్లను పరిశీలించి, లెక్కల్లో తేడాలు ఉన్న విషయాన్ని గుర్తించి, సిబ్బందిని నిలదీశారు. ఆలయం ప్రైవేటు ఆస్తి కాదని, ప్రభుత్వ సంస్థ అని, లెక్కలు సరిగ్గా ఉండాలని, ఇంకోసారి తేడాలు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రసాదాల నాణ్యతపై విమర్శలు ఉన్న నేపథ్యంలో త్వరలో జరగబోయే మార్గశిర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. క్యూలైన్లు అవపసరమైనన్ని ఏర్పాటుచేసి భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కల్పించాలన్నారు. అన్న ప్రసాదంలో నాణ్యత మెరుగుపడాలని సూచించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. కలెక్టర్‌ అడిగిన ప్రశ్నలకు ఆలయ ఈఈ వెంకట రమణ, ఏఈఓలు సమాధానాలిచ్చారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నామని ఈఈ వెంకటరమణ చెప్పగా పూర్తి ప్రతిపాదనలు తనకు సమర్పించాలని సూచించారు.


వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి

అంతా సమన్వయంతో పనిచేసి రోగులకు మెరుగైన సేవలు అందించాలి

అన్ని విభాగాల పనితీరు మెరుగుపడాలి

కేజీహెచ్‌ అధికారులు, విభాగాధిపతులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లో అధికారులు, వైద్యులు సమన్వయంతో పని చేసి రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ సూచించారు. శుక్రవారం ఉదయం కేజీహెచ్‌ను సందర్శించిన ఆయన పలు విభాగాధిపతులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విభాగాల వారీగా ఉన్న అవసరాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంకాలజీ విభాగానికి 30 మంది స్టాఫ్‌ నర్సులు, గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగానికి వైద్య పరికరాలు అవసరమని వైద్యులు చెప్పారు. ఎండోక్రైనాలజీ విభాగంలో లీకేజీలు ఉన్నాయని, మరమ్మతులు చేయాలని వైద్యులు కోరారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రోగులకు సేవలు అందించడంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని స్పష్టంచేశారు. అన్ని విభాగాల్లో పనితీరు మరింత మెరుగుపడాలని స్పష్టంచేశారు. ఆస్పత్రిలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయం గురించి ప్రస్తావిస్తూ...డీఎంఈతో మాట్లాడి అక్కడి నుంచే విధులకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చేలా చేస్తానని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అప్పటివరకూ పాలనలో ఇబ్బందులు లేకుండా సమన్వయంతో ముందుకువెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కేజీహెచ్‌ అడ్మినిస్ర్టేటర్‌ బీవీ రమణ, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ యు.శ్రీహరి, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్‌ చంద్రశేఖరంనాయుడు, డాక్టర్‌ వాసవీ లత, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ బంగారునాయుడు, ఏడీ సుమతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:56 AM