ద్వారకా బస్‌స్టేషన్‌లో కలెక్టర్ తనిఖీలు
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:57 AM
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ గురువారం ద్వారకా బస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బస్సుల వేళలు, నిర్వహణ పరిశీలన
ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలపై ఆరా
బస్సులను శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచన
ద్వారకా బస్‌స్టేషన్, జూలై 31 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ గురువారం ద్వారకా బస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్సుల వేళలకు సంబంధించిన సమాచార పట్టికను పరిశీలించారు. షెడ్యూల్ సమయంలో బస్సులు తిరుగుతున్నాయా లేదా అని ట్రాఫిక్ నియంత్రణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టు బస్సులు ఉన్నాయా లేదా అని రీజనల్ మేనేజర్‌ను అడిగారు. కాంప్లెక్సుకు వచ్చిన బస్సులను పరిశీలించి వాటి నిర్వాహణ తీరు గురించి అధికారులను అడిగారు. కాంప్లెక్స్‌లో పే అండ్ యూజ్ మరుగుదొడ్ల సముదాయాలను, వెలుపల ఉన్న పబ్లిక్ మురుగుదొడ్ల సముదాయాలను, వాటి నిర్వాహణ తీరును పరిశీలించారు. టిక్కెట్ కౌంటర్లు, కౌంటర్ల దగ్గర క్యూలో నిలుచున్న ప్రయాణికులకు ఫ్యాన్‌లు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. కాంప్లెక్సులో తాగునీటి సదుపాయాన్ని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను, వాటి పనితీరును పరిశీలించారు. బస్ కాంప్లెక్స్‌లోని స్టాళ్లను పరిశీలించి అన్ని రకాల ఐటమ్స్ ఎంఆర్‌పీకి అమ్ముతున్నారా లేదా అని ఆరా తీశారు. కాంప్లెక్సు నిర్వాహణపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తంచేశారు. బస్సుల్లో కిటికీ కర్టెన్స్‌ను తరచూ మారుస్తూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.పద్మావతి, సెక్యూరిటీ ఆఫీసర్ ఐవీవీపీ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నాయుడు, పలువురు అధికారులు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.