శిశు మరణాలపై కలెక్టర్ ఆరా
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:43 AM
మండలంలోని దారెల పంచాయతీలో కలెక్టర్ దినేశ్‌కుమార్ బుధవారం పర్యటించారు. శిశు మరణాలపై ఆయన ఆరా తీశారు.
దారెల పంచాయతీలో పర్యటన
డి.కుమ్మరిపుట్టులో బాధిత కుటుంబానికి పరామర్శ
భయపడనవసరం లేదని భరోసా
ముంచంగిపుట్టు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దారెల పంచాయతీలో కలెక్టర్ దినేశ్‌కుమార్ బుధవారం పర్యటించారు. శిశు మరణాలపై ఆయన ఆరా తీశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి పసి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
హర్షశ్రీ అనే శిశువు మరణించిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు శ్రీకాంత్, రాజేశ్వరిలతో మాట్లాడి మరణానికి గల కారణాలు, శిశువుకు అందించిన వైద్య సేవలపై ఆరా తీశారు. రక్తహీనతతో బాధపడుతున్న రాజేశ్వరిని ప్రత్యేక అంబులెన్స్‌లో సీహెచ్‌సీకి తరలించారు. గ్రామంలో ఉన్న బాలింతలతో మాట్లాడారు. పిల్లల సంరక్షణపై పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్యశాఖాధికారులపై కలెక్టర్ ఆగ్రహం
వైద్య ఆరోగ్య శాఖాధికారుల పని తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పసి పిల్లలు వరుసగా మృతి చెందితే మీరు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇప్పటి వరకు జరిగిన శిశు మరణాలకు గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇకపై అటువంటి సంఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో సంపూర్ణ వైద్య సేవలు అందే విధంగా చూడాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దారెల పంచాయతీలో శిశు మరణాలపై ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి వివరాలను సేకరించామన్నారు. ముగ్గురు పిల్లలు శ్వాస సమస్య వలన మృతి చెందారని, మరో ఇద్దరు పిల్లలు పుట్టుకతోనే ఆరోగ్య సమస్య ఉండడం వలన కేజీహెచ్‌లో ఆపరేషన్ చేసి రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ మృతి చెందినట్టు చెప్పారు. పాడేరులో చిన్నపిల్లల కోసం మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్స్ ఐసీయూ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీలో చలికాలంలో చిన్నారులు నిమోనియా బారిన పడుతున్నారని చెప్పారు. అనంతరం ఆయన దారెల పంచాయతీ కేంద్రాన్ని సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కృష్ణమూర్తి నాయక్, డీఈవో బ్రహ్మజీరావు, ఎంపీడీవో ధర్మారావు, తహశీల్దార్ భాస్కరఅప్పారావు, పీఆర్ ఏఈ,మురళీకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజేశ్, సర్పంచ్ పి.పాండురంగస్వామి, ఎంపీటీసీ మల్లికార్జున్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.