రెవెన్యూ సేవలపై కలెక్టర్ అసంతృప్తి
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:43 AM
జిల్లాలో భూముల మ్యుటేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో రెవెన్యూ సేవలపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
- భూముల మ్యూటేషన్ సక్రమంగా జరగడం లేదని అసహనం
- అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశం
పాడేరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల మ్యుటేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో రెవెన్యూ సేవలపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 1,130 మ్యుటేషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై ప్రణాళికాబద్ధంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మీ కోసం కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, వాటికి సంబంధించి ప్రజలకు సంతృప్తికరమైన సేవలను అందించాలన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఎండార్స్‌మెంట్‌పై తహశీల్దార్ సంతకం లేకుంటే, అందుకు బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి వారం క్షేత్ర స్థాయిలో సమస్యలపై తహశీల్దార్లు సమావేశాలు నిర్వహించాలని, పాడేరు, రంపచోడవరం, చింతూరు సబ్‌కలెక్టర్లు ఆయా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. అలాగే బదిలీపై వచ్చిన తహశీల్దార్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో అన్నదాత సుఖీభవకు సంబంధించి 890 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి స్థితిగతులను పరిశీలించి క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆధార్‌కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, పట్టాదారు పాస్ పుస్తకాల్లో సమస్యల కారణంగానే అవి పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సరిచేసే చర్యలు చేపడుతున్నామని వ్యవసాయాధికారులు తెలిపారు. ఇప్పటికి పెండింగ్‌లో ఉన్న మొత్తం దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
వరదల నేపథ్యంలో అప్రమత్తం
తాజా వరదల నేపథ్యంలో చింతూరు రెవెన్యూ డివిజన్‌లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. ముఖ్యంగా చింతూరు, వీఆర్.పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో తహశీల్దార్లు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్ లోకేశ్వరరావు, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, జిల్లాలోని 22 మండలాలకు చెందిన తహశీల్దార్లు, వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు.