స్వచ్ఛోత్సవ్‌లో కలెక్టర్
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:11 AM
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన స్వచ్ఛోత్సవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొని కలెక్టరేట్ ఆవరణలో చెత్తా చెదారాన్ని తొలగించారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన స్వచ్ఛోత్సవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొని కలెక్టరేట్ ఆవరణలో చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆయనతో పాటు డీఆర్వో భవానీశంకర్, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఇతర కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది స్వచ్ఛోత్సవ్‌లో భాగంగా పరిసరాలను పరిశుభ్రం చేశారు. జిల్లా పరిషత్ ఆవరణలో సీఈవో పి.నారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు.
విలేజ్ మాల్స్
రేషన్ డిపోలకు కొత్తరూపు
ప్రయోగాత్మకంగా 15 డిపోల ఎంపిక
బియ్యం, పంచదారతో పాటు మరిన్ని సరకులు, జీసీసీ ఉత్పత్తుల విక్రయానికి ఏర్పాట్లు
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
రేషన్ డిపోల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా విలేజ్ మాల్స్ పేరుతో బియ్యం, పంచదారతో పాటు మరిన్ని సరకులను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ప్రయోగాత్మకంగా జిల్లాలో 15 రేషన్ డిపోలను గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వానికి పంపింది. జిల్లాలో నాలుగు గ్రామీణ మండలాలు, నగరంలోని మూడు సర్కిళ్లలో కలిపి 5.24 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతి కార్డుకు సగటున ముగ్గురు సభ్యుల చొప్పున మొత్తం 15 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు కార్డుదారులకు బియ్యం, పంచదార అందిస్తున్నారు. అవేకాకుండా అన్నిరకాల నిత్యావసర సరకులు అందుబాటులో ఉండేలా పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. వాటితో పాటు గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తులు ఉంచుతారు.
ఆర్టీసీ పండుగ స్పెషల్స్
విజయనగరం జోనల్ పరిధిలో 50 బస్సులు నడిపినట్టు అధికారుల ప్రకటన
నేడు కూడా...మహిళా ప్రయాణికులే అధికం
ద్వారకా బస్‌స్టేషన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
దసరా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు గురువారం విజయనగరం జోనల్ పరిధిలోని పలు ప్రాంతాలకు 50 ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేశారు. ఉదయం 6.00 గంటల నుంచి ద్వారకా బస్‌స్టేషన్, మద్దిలపాలెం, స్టీల్ సిటీ కాంప్లెక్సుల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేశారు. రాజమండ్రికి 5, కాకినాడ 4 స్పెషల్స్, శ్రీకాకుళానికి 8 ఇచ్ఛాపురానికి 4, పలాస 3, సోంపేట 3, పాతపట్నం 1, రాజాం 4, విజయనగరానికి 7, బొబ్బిలి 4, పార్వతీపురం 4, సాలూరు కు 3 బస్సులు ప్రత్యేక సర్వీసులుగా నడిపారు. అన్ని రూట్లలోను మహిళా ప్రయాణికులు అధికంగా ఉండడంతో స్త్రీశక్తి పథకం వర్తించే పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నడిపారు. శుక్రవారం దసరా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందికనుక అందుకు తగ్గట్టుగా బస్సులు సిద్ధం చేశామని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు తెలిపారు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఎంపిక చేసిన 50 బస్సులు ప్రత్యేక సర్వీసులుగా నడిపేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
కొత్త టీచర్లలో సంబరం
మెగా డీఎస్సీలో 1,269 మంది ఎంపిక
విజయవాడలో 1,244 మందికి నియామకపత్రాల అందజేత
హాజరుకాలేకపోయిన 25 మంది బాలింతలు, గర్భిణులు
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
మెగా డీఎస్సీ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మొత్తం 1,269 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిలో 1,244 మంది గురువారం సాయంత్రం విజయవాడలో నియామకపత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బుధవారం జిల్లా నుంచి సుమారు 80 బస్సుల్లో కొత్త ఉపాధ్యాయులు విజయవాడ బయలుదేరి వెళ్లారు. వీరిలో ఉమ్మడి జిల్లా అరకు ప్రాంతానికి చెందిన ఒకరిద్దరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియామకపత్రాలు అందజేశారు. మిగిలిన వారికి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కౌంటర్లలో డీఈవో, ఇతర అధికారులు అందజేశారు.