Share News

కారుణ్య నియామకాలకు కలెక్షన్‌

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:21 AM

జీవీఎంసీలో కారుణ్య నియామకాల పేరుతో ఒక అధికారి వసూళ్ల పర్వానికి దిగారు.

కారుణ్య నియామకాలకు కలెక్షన్‌

జీవీఎంసీలో ఒక అధికారి సూత్రధారి

ఉద్యోగార్ధులతో ‘సీ’ సెక్షన్‌ ఉద్యోగి బేరసారాలు

అడిగినంత ఇస్తే జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం

ఇవ్వకపోతే క్లాస్‌-4 ఉద్యోగమేనని బెదిరింపు

ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు నుంచి రూ.1.5 లక్షలు వసూలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీలో కారుణ్య నియామకాల పేరుతో ఒక అధికారి వసూళ్ల పర్వానికి దిగారు. తన అనుచరుడైన ‘సీ’ సెక్షన్‌లోని ఒక ఉద్యోగి ద్వారా ఉద్యోగార్థులతో బేరసారాలు జరిపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూప్‌-3 కేటగిరీ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సదరు అధికారికి అడిగినంత ఇవ్వాల్సిందేనని...కాదంటే గ్రూప్‌-4లో ఉద్యోగాలే వస్తాయని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. వసూళ్ల తంతు పూర్తయిన తర్వాతే జాబితాను కమిషనర్‌కు పంపించాలని ఆ అధికారి నిర్ణయించినట్టు సమాచారం.

జీవీఎంసీలో శాశ్వత ఉద్యోగి ఎవరైనా సర్వీస్‌లో ఉండగా మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. మరణించిన ఉద్యోగి సంపాదనే ఆ కుటుంబానికి జీవనాధారమై ఉండి, కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసే వ్యక్తికి మరెలాంటి సంపాదన లేనప్పుడు అధికారులు అవకాశం కల్పిస్తారు. గత పది నెలలుగా కారుణ్య నియామకాలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం సుమారు 30 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి కనీసం డిగ్రీ పాసై ఉంటే జూనియర్‌ అసిస్టెంట్‌, డిప్లమో, ఇంజనీరింగ్‌ వంటి టెక్నికల్‌ అర్హతలు కలిగి ఉంటే వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, పదో తరగతి చదువుకుని ఉంటే రికార్డు అసిస్టెంట్‌, మజ్దూర్‌, అటెండర్‌ వంటి ఉద్యోగాలు కల్పిస్తారు. అయితే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తే తనకేమి లాభమని జీవీఎంసీలో కీలక అధికారి ఒకరు తనకు అత్యంత నమ్మకస్తుడైన ‘సీ’ సెక్షన్‌లోని ఉద్యోగి వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఇదే అదనుగా సదరు ఉద్యోగి కారుణ్య కోటాలో ఉద్యోగాలు పొందబోయే వారికి ఫోన్‌ చేసి బేరసారాలు ప్రారంభించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూప్‌-3 పోస్టు అయిన జూనియర్‌ అసిస్టెంట్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. కాబట్టి అర్హత కలిగిన వారికి ఫోన్‌ చేసి రూ.1.5 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని ప్రలోభపెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా అంతమొత్తం ఇచ్చుకోలేమంటే రూ.50 వేలు కనీస మొత్తంగా చెల్లించాలని అడిగారు. అదే వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు అయితే రూ.లక్ష వరకు డిమాండ్‌ చేసినట్టు సమాచారం. కారుణ్య కోటాలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళా అభ్యర్థినితో సదరు ఉద్యోగి లంచం గురించి మాట్లాడినప్పుడు ఆమె రికార్డింగ్‌ చేసి తనకు తెలిసిన వారికి పంపించారు. దీంతో ‘కారుణ్య కోటా’లో ఉద్యోగాల భర్తీ కోసం వసూళ్లపర్వం బయటకు వచ్చింది. వసూళ్ల తతంగం దాదాపు పూర్తికావడంతో వారి ఫైల్‌ను త్వరలోనే కమిషనర్‌కు పంపించాలని సూత్రధారి అయిన అధికారి యోచిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ దృష్టిసారించాల్సి ఉంది.

Updated Date - Oct 11 , 2025 | 01:21 AM