ఏయూ దూర విద్యప్రాక్టికల్స్‌కు కలెక్షన్
ABN , Publish Date - May 23 , 2025 | 01:23 AM
ఏయూ దూరవిద్య పరీక్షా కేంద్రాల్లో వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట పడడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా 58 ప్రైవేటు కాలేజీల్లో తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహణ
అనేక కాలేజీల్లో తరగతులు, ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులు
ఒక్కొక్కరి నుంచి రూ.6 వేలు వసూలుచేసి మేనేజ్ చేస్తున్న యాజమాన్యాలు
పట్టించుకోని ఉన్నతాధికారులు
గతంలో మాదిరిగా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే నిర్వహిస్తే అక్రమాలకు అడ్డుకట్ట
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):
ఏయూ దూరవిద్య పరీక్షా కేంద్రాల్లో వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట పడడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. బ్యాక్‌లాగ్స్ ఉన్న 2019-22 బ్యాచ్ బీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 12 నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహించేలా దూరవిద్య అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఇందుకోసం ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం జిల్లా వరకు 58 కేంద్రాలు ఏర్పాటుచేశారు. అయితే, వాటిలో దాదాపు 10 నుంచి 20 కాలేజీలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థి ప్రాక్టికల్స్‌కు ముందు ఆయా కాలేజీల్లో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే, దూరవిద్య కోర్సుల్లో చేరిన అభ్యర్థుల్లో దాదాపు 99 శాతం మంది ఉద్యోగాలు, వ్యాపకాల్లో ఉన్నవారే ఉంటారు. వారిలో చాలామంది తరగతులకు, ప్రాక్టికల్స్‌కు హాజరుకారు. అటువంటి వారిపై ఈ కేంద్రాల నిర్వాహకులు దృష్టిసారించారు. తరగతులకు హాజరుకాకుంటే రూ.3 వేలు, ప్రాక్టికల్స్‌కు కూడా హాజరుకాలేకపోతే మరో మూడు వేలు...మొత్తం రూ.6 వేలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థుల నుంచి ఆయా కాలేజీలు డబ్బులు వసూలు చేసినట్టు చెబుతున్నారు.
వర్సిటీ ఆదాయానికి గండి
దూర విద్య కేంద్రం నిర్వహించే కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్స్‌ను గతంలో ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే నిర్వహించేవారు. దాంతో పకడ్బందీగా జరిగేవి. అయితే, కొన్నాళ్ల కిందట ఈ విధానంలో వర్సిటీ అధికారులు మార్పులు చేశారు. ప్రాక్టికల్స్ నిర్వహించుకునే అవకాశం ప్రైవేటు కాలేజీలకు ఇచ్చారు. అదే ఆయా కాలేజీలకు ఆదాయ వనరుగా మారుతోంది. మరోవైపు వర్సిటీ ఆదాయానికి కూడా గండి పడుతోంది. ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి కాలేజీకి రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకూ యూనివర్సిటీ చెల్లిస్తుంది. ప్రాక్టికల్స్, తరగతుల నిర్వహణ, సిబ్బంది టీఏ, డీఏల కోసం ఈ మొత్తాన్ని యూనివర్సిటీ అధికారులు చెల్లిస్తారు. అయితే, అక్కడ ప్రక్రియ సక్రమంగా జరగనప్పుడు నిధులు వెచ్చించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్సిటీ ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారిస్తే బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగా ప్రభుత్వ కాలేజీలకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తే ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. దీనిపై దూరవిద్య కేంద్రం డైరెక్టర్ విజయ్‌మోహన్‌ను వివరణ కోరగా...వసూళ్ల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. అటువంటిదేమైనా జరిగినట్టయితే కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాక్టికల్స్ పర్యవేక్షణకు అబ్జర్వర్స్‌ను నియమిస్తామన్నారు.