Share News

పదోన్నతుల కోసం పైసా వసూల్‌

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:19 AM

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో పదోన్నతులకు భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పదోన్నతుల కోసం పైసా వసూల్‌

డీసీసీబీలో కలెక్షన్‌ కింగ్‌లు

పోస్టును బట్టి రేటు

రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ...

మొత్తం రూ.కోటి?

విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో పదోన్నతులకు భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో కీలక స్థానంలో ఉన్నవారికి సన్నిహితులైనవారు (అనధికార వ్యక్తులు) చేతులమీదుగా ఈ వ్యవహారం సాగినట్టు ఫిర్యాదులు వచ్చాయి.

బ్యాంకు ప్రధాన కార్యాలయంతో పాటు 33 బ్రాంచీలలో ఖాళీల మేరకు పదోన్నతులు కల్పించేందుకు గత నెల 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒక డీజీఎం, నాలుగు ఏజీఎం, నాలుగు చీఫ్‌ మేనేజర్‌, ఆరు మేనేజర్‌, 12 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు బోర్డును ఏర్పాటుచేశారు. ఇందులో బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి, సీఈవో, ఆప్కాబ్‌ నుంచి జనరల్‌ మేనేజర్‌, ఆప్కాబ్‌ నామినేట్‌ చేసిన సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ ఒకరు ఉన్నారు. డీజీఎం పోస్టుకు ఒకరు, నాలుగు ఏజీఎం పోస్టులకు నలుగురు, నాలుగు చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు 18 మంది, ఆరు మేనేజర్‌ పోస్టులకు 20 మంది, 12 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 60 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. పదోన్నతుల ప్రక్రియలో 100 మార్కులు ఉంటాయి. ఇందులో 80 మార్కులు సదరు అధికారి/ఉద్యోగి సర్వీస్‌కు సంబంధించి, మరో 10 మార్కులు సదరు అధికారి/ఉద్యోగి పనితీరుపై ఆధారపడి (పైఅధికారి వేస్తారు) ఉంటాయి. మిగిలిన పది మార్కులకు ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలన్నీ పూర్తిచేసి గత నెల 31న పదోన్నతులకు సంబంధించి ఆర్డర్లు ఇచ్చారు.

అయితే ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం పదోన్నతుల జాబితాలో పేరు కలిగిన వారి వద్ద నుంచి బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడు ఒకరు వసూళ్లకు తెరతీశారు. పోస్టును బట్టి మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకూ తీసుకున్నట్టు చెబుతున్నారు. నగరంలో ప్రముఖ మోటారు వాహనాల కంపెనీలో పనిచేసే వ్యక్తి డీసీసీబీలో కీలక వ్యక్తి ఛాంబర్‌కు వస్తున్నాడు. మార్కెట్‌ వ్యవహారాలలో అనుభవం ఉన్న ఆయన స్వయంగా ఫోన్‌ చేసి ఫలానా చోటుకు సొమ్ములు తీసుకురావాలని కోరినట్టు చెబుతున్నారు. కీలక వ్యక్తి సూచన మేరకు సుమారు కోటి రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరూ సొమ్ములు ఇవ్వాల్సిందేనని దబాయించారని కొందరు ఉద్యోగులు అంటున్నారు. సొమ్ముల వ్యవహారంపై కొందరు సిబ్బంది ఆప్కాబ్‌కు ఫిర్యాదులు చేశారని చెబుతున్నారు. కాగా ఈ ఆరోపణలను బ్యాంకు సీఈవో డీవీఎస్‌ వర్మ వద్ద ప్రస్తావించగా ఆప్కాబ్‌ నిబంధనలు, మార్గదర్శకాల మేరకూ పదోన్నతులు కల్పించామన్నారు. మెరిట్‌, రోస్టర్‌ మేరకు ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థుల జాబితా తయారుచేశామన్నారు. పదోన్నతులు పారదర్శకంగా చేపట్టామని పేర్కొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 01:19 AM